ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కు ధరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు అంజాద్ బాషా పేర్కొన్నారు.
సోమవారం కడపలో కోవిడ్-19 పై టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కరోనా కట్టడి కోసం గత మార్చి 22వ తేదీ నుంచి మే 15వ వరకు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ నిర్వహించడం జరిగిందన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మే 16వ తేదీ నుంచి లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం కడప జిల్లాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు.
ఎక్కువగా పులివెందుల, ప్రొద్దుటూరు పట్టణాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి కరోనా నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు.
శానిటైజర్ లు తరచుగా ఉపయోగిస్తూ ఉండాలన్నారు. కరోనా మహమ్మారి వల్ల ఇప్పటివరకు జిల్లాలో ఏడు మంది చనిపోయారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కరోనా కట్టడికి అనేక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు జులై 1వ తేదీ నుంచి వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
కరోనా కట్టడికి అధికార యంత్రాంగంమే కాక ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమన్నారు. నేటి నుంచి కరోనా నివారణకు జిల్లా యంత్రాంగం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఇందుకు ప్రజలు అందరూ సహకరించాలన్నారు. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో కి మాస్క్ లేనిదే ఎవరిని కూడా లోపలికి అనుమతించకూడదన్నారు.
'నో మాస్క్ నో ఎంట్రీ' అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలన్నారు. కరోనా అంటే కొంతమంది భయపడడం లేదని, కరోనా వల్ల అభివృద్ధి చెందిన దేశాలలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ విషయాన్ని గుర్తించి వ్యాపారస్తులు, షాపుల యజమానులు మాస్కులు, చేతులకు గ్లౌజులు ధరించి విక్రయించాలన్నారు.
అలా విక్రయించిన షాపు యజమానులకు మొదటిసారి రెండు వేల రూపాయలు, రెండవ సారి ఐదు వేల రూపాయలు, మూడవ సారి కూడా మాస్కులు, గ్లౌజ్ లు ధరించకపోతే షాపును సీజ్ చేయడం జరుగుతుందన్నారు. కడపలో మాస్కు లేకపోతే 300 ఫైన్ విధించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు షాపుల దగ్గర తప్పకుండా 'నో మాస్క్ నో ఎంట్రీ' అనే స్టిక్కర్ అతికించాలన్నారు.
కరోనాపై ప్రతి ఒక్కరిలో చైతన్యం వచ్చి మన జిల్లా నుంచి కరోనాను పూర్తిగా తరిమి వేయాల్సిన అవసరం మన అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మలోలా, మున్సిపల్ కమిషనర్ లవన్న, డిఎస్పి సూర్యనారాయణ, తాసిల్దార్ శివరామిరెడ్డి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.