ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు: ఐదుగురు సజీవ దహనం.. రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా

గురువారం, 30 జూన్ 2022 (13:07 IST)
శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగి ఆటోపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. ముగ్గురు మాత్రం ఆటోలో నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు.  
 
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి దగ్గర విద్యుత్‌ వైర్లు తాకి ఆటో ప్రమాదానికి గురైన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. 
 
ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని.. మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పారిస్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ఘటన వివరాలను సీఎంవో అధికారులు తెలియజేశారు.
 
మరోవైపు ఈ ఘటనపై విచారణ జరిపి తక్షణం నివేదిక అందించాల్సిందిగా అనంతపురం సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్‌ను ఆదేశించినట్లు ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు అన్నారు. 
 
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అనంతపురం ఎస్ఈని ఆదేశించామన్నారు. హై టెన్షన్ విద్యుత్ లైన్‌పై ఉడుత పడిన కారణంగానే విద్యుత్ తీగ తెగిపోయిందన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు