కెనాల్‌లో దూసుకెళ్లిన కారు, న్యాయవాది కుటుంబంలో ముగ్గురు మృతి

సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (17:38 IST)
హైదరాబాద్ నుంచి న్యాయవాది కుటుంబం కారులో వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును కెనాల్ నుంచి వెలికి తీశారు. 
 
తెలంగాణలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు వణికిస్తున్నాయి. మొన్న వరంగల్ జిల్లాలో కెనాల్‌ కారు ప్రమాదం ఘటన మరువక ముందే మరో కారు కెనాల్‌లో దూసుకెళ్లింది. ఈసారి జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది.
 
కారు ఎస్సారెస్పీ కెనాల్ లోకి దూసుకెళ్లడంతో ముగ్గురు గల్లంతయ్యారు. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారు కోరుట్ల మండలం జొగినిపల్లికి చెందిన న్యాయవాది అమరేందర్ రావు కుటుంబసభ్యులుగా గుర్తించారు. అమరేందర్ రావు భార్య శిరీషా, కూతురు శ్రేయా, కుమారుడు జయంత్ నలుగురు కారులో హైదరాబాద్ వెళ్ళి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు.
 
తెల్లవారుజామున కారు కెనాల్ లోకి దూసుకెళ్లడంతో కుమారుడు జయంత్ ప్రాణాలతో బయట పడ్డాడు. ముగ్గురు కారుతో సహా గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ జయంత్ బయటికి వచ్చి చెప్పేవరకు కారు కెనాల్‌లో పడ్డ విషయం ఎవరికీ తెలియదు. కెనాల్‌లో వాటర్ ఫుల్లుగా ఉండడంతో గల్లంతైనవారి ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులు రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని కెనాల్‌లో నీటిని నిలిపివేసి గాలింపు చర్యలు చేపట్టారు.
 
ఆ తర్వాత ముగ్గురి మృతదేహాల్ని వెలికితీశారు. కెనాల్‌లో పడ్డ కారును కూడా స్థానికుల సాయంతో బయటకు తీశారు. అమరేందర్ రావు జగిత్యాలలో న్యాయవాదిగా పనిచేస్తారని స్థానికులు తెలిపారు. బయటపడ్డ ఆయన కుమారుడు జయంత్ మాత్రం ఈ ఘటనపై మాట్లాడేందుకు నిరాకరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు