మంత్రి కేటీఆర్‌ను అడ్డుకున్న విద్యార్థులు.. లాఠీ ఝళిపించిన ఖాకీలు
శనివారం, 10 జులై 2021 (15:16 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ శనివారం విద్యార్థుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. శనివారం నారాయణపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. దీంతో ఆయన పర్యటనను అడ్డుకునేందుకు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రయత్నించారు.
అయితే, ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్య ధోరణిని విడనాడాలని వారు నినాదాలు చేశారు.
కాగా, తన పర్యటన సందర్భంగా కేటీఆర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 10 ఐసీయూ పడకలు, 3 వెంటిలేటర్లతో కూడిన చిన్నారుల వార్డును ప్రారంభించారు. అలాగే, వెజ్, నాన్వెజ్ మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు.
అమరవీరుల స్మారక ఉద్యానవనంతో పాటు సింగారం క్రాస్ రోడ్డులో చేనేత కేంద్రం పనులను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఇదిలావుంటే, నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణా నదీ జలాల వివాదంపై స్పందించారు. కృష్ణా నదీ జలాల విషయంలో తాము ఎవరితోనూ రాజీపడబోమని స్పష్టం చేశారు.
చట్ట ప్రకారం తమకు రావాల్సిన నీటి కేటాయింపుల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో ఏపీతోనే కాదు, అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడుతామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు పరమావధి అన్నారు.
కేటీఆర్ నేడు నారాయణపేటలో ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ ట్రైనింగ్, టెక్స్ టైల్ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కోరిన మీదట, రూ.10 కోట్లతో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కు శ్రీకారం చుడుతున్నట్టు కేటీఆర్ వెల్లడించారు.