అమరావతి ఎయిర్ షో - 2018, ఆతిథ్యం ఇస్తున్న ఆంధ్రప్రదేశ్
సోమవారం, 19 నవంబరు 2018 (19:48 IST)
అంతర్జాతీయ స్ధాయి బోట్ రేసింగ్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ తన జోష్‌ను కొనసాగిస్తోంది. కృష్ణా నదీ జలాలు వేదికగా మరో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్దం అవుతోంది. ఎఫ్1హెచ్20 బోట్ రేసింగ్‌ను అమరావతి వేదికగా నిర్వహించి అందరి మన్ననలను పొందిన పర్యాటక శాఖ ఈ వారంతంలోకూడా విజయవాడ వాసులను అలరించేందుకు ఎయిర్ షొను ప్రజల ముందుకు తీసుకురాబోతుంది.
ఈ నెల 23, 24, 25 తేదీలలో బెరం పార్కు వేదికగా తాజా కార్యక్రమం జరగనుండగా, ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాధికార సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి హిమాన్హు శుక్లా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై క్షేత్రస్ధాయి పర్యటన, సమీక్ష నిర్వహించారు. పర్యాటక శాఖ ఈ కార్యక్రమాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సహకారంతో విజయవాడ కేంద్రంగా నిర్వహిస్తుండగా ఆ సంస్ధ ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
రానున్న శుక్ర, శని, ఆదివారాలలో ఈ కార్యక్రమం జరగనున్నప్పటికీ బుధ, గురు వారాలలో కూడా ఎయిర్ క్రాప్ట్‌లు కృషా నదీ జలాలపై గగన విహారం చేయనున్నాయి. 21, 22 తేదీలలో ట్రయల్ రన్ నిర్వహించనుండటంతో వరుసగా ఐదు రోజుల పాటు పర్యాటకుల చూపు విజయవాడ వైపు ఆకర్షితం కానుంది.
ట్రయల్ రన్ తేదీలతో సహా అన్ని రోజులు ఉదయం 11 గంటల నుండి 11.15 వరకు, సాయంత్రం 4 గంటల నుండి 4.15 వరకు ఎయిర్ షో జరుగుతుంది. ఈ క్రమంలో పున్నమీ ఘాట్ వేదికగా ఏ తరహా కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై హిమాన్హు శుక్లా పర్యాటక అధికారులకు దిశానిర్ధేశం చేసారు. విమాన విన్యాసాలు కేవలం ఉదయం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు మాత్రమే కొనసాగనుండగా, పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని పంచేలా ఎటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందన్న దానిపై సమావేశంలో చర్చించారు. భవానీ ద్వీపం వేదికగా ప్రత్యేక ప్యాకేజీలను తీసుకురావాలని నిర్ణయించారు.
కార్తీక మాసపువేళ ఇప్పటికే భవానీ ద్వీపం సందడి సంతరించుకోగా, విమాన విన్యాసాలు ఎక్కడి నుండైనా చూసే అవకాశం ఉన్నందున భవానీ ద్వీపం పర్యటనకు ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలని నిర్ణయించారు. అమరావతి ఎయిర్ షో -2018 ప్రారంభ వేడుక 23వ తేదీన జరగనుండగా పర్యాటక భాషా సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ ముఖ్య అతిధిగా హాజరు కానుండగా, కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు.
అమరావతి ఎయిర్ షో -2018 ప్రారంభ వేడుక 23వ తేదీన జరగనుండగా పర్యాటక భాషా సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ ముఖ్య అతిధిగా హాజరు కానుండగా, కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు. 25వ తేదీన జరిగే ముగింపు వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు హాజరు కానుండగా, కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు పర్యాటక శాఖ కసరత్తును ప్రారంభించింది.
ఈ సందర్భంగా హిమాన్హు శుక్లా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు అదేశాల మేరకు పర్యాటక శాఖ విభిన్న కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఎఫ్1హెచ్20 పవర్ బోట్ రేసింగ్‌ను అందరి సహకారంతో విజయవంతం చేయగలిగామని, ముఖ్యమంత్రి సైతం తమ శాఖ పనితీరుకు మంచి మార్కులు వేసారని, ఇది తమకు ఎంతో బలాన్ని ఇచ్చిందని అదే క్రమంలో భాధ్యతను సైతం పెంచిందన్నారు. ఈ క్రమంలోనే ముగింపు వేడుకలో కలర్‌పుల్ క్రాకర్స్ షోకు ఏర్పాట్లు చేస్తున్నామని, అటు అమరావతి, ఇటు పర్యాటక సంస్ధ బ్రాండింగ్‌ను పెంచేలా ఏర్పాట్లు ఉంటాయని వివరించారు.