రైతుల త్యాగం వృధాకారాదు : నాగబాబు

శుక్రవారం, 20 డిశెంబరు 2019 (16:03 IST)
నవ్యాంధ్రకు రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై అమరావతి రైతులు దీక్షకు దిగారు. మందడంలో జరిగిన ఈ దీక్షకు జనసేన నేత, సినీనటుడు నాగబాబుతో పాటు.. ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తమ సంఘీభావం తెలుపుతూ దీక్షలో కూర్చొన్నారు. 
 
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రైతులు తమ కుటుంబాలతో పాటు రోడ్డుపైకి వచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల పోరాటానికి తాను మద్దతు తెలుపుతున్నానని చెప్పారు. అమరావతిలో రాజధానిని యథాతథంగా కొనసాగించాలన్నదే జనసేన డిమాండ్ అని నాగబాబు తెలిపారు. 
 
గతంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలను వైసీపీ సర్కారు అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతుల కష్టాల పరిష్కారం కోసం పోరాడేందుకు తమ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన చెప్పారు.
 
ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రైతులకు న్యాయం జరిగేవరకు అండగా ఉంటామన్నారు. రైతులకు రాజకీయ రంగు ఎందుకు పులుముతున్నారని, రైతుల కులాల ప్రస్తావన ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. రాజధాని కోసం అమరావతి రైతులు తమ భూములను త్యాగం చేశారని, రాజధాని రైతుల సమస్యలు తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు బాగా తెలుసన్నారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం రైతులను గౌరవించాలని నాదెండ్ల మనోహర్ అన్నారు. 70 శాతం రైతులు ఐదు ఎకరాల లోపు భూములు ఉన్నవారేనని, రైతులకు తాము అండగా ఉంటామని చెప్పారు. అధికారం ఉందని రైతులను బాధపెట్టడం సరికాదని అన్నారు. 
 
రాజధానిపై ప్రభుత్వం వేసిన కమిటీలోని సభ్యులు ఎన్నడైనా అమరావతికి వచ్చారా? రైతుల అభిప్రాయాలను తీసుకున్నారా? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నలు సంధించారు. ప్రజలకు నష్టం కలిగేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు