శాఖాహారం కావచ్చు, మాంసాహారం కావచ్చు... రాష్ట్ర ప్రజలకు ప్రీతిపాత్రమైన వంటకాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని బహుళ ప్రాచుర్యం పొందినవి కాగా, మరికొన్ని అంతగా పర్యాటకుల దృష్టిని ఆకర్షించలేక పోయాయి. ఈ లోటును భర్తీ చేయాలన్న ధ్యేయంతో పర్యాటక శాఖ పలు కార్యక్రమాలు చేపడుతోంది. పోషక విలువలతో కూడిన తెలుగు వంటకాలను ప్రపంచ పర్యాటకులకు చేరువ చేసే క్రమంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రా ఆహార పండుగలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే నగరంలోని హోటల్ డివి మేనర్‌లో 18వ తేదీ శనివారం నుండి సెప్టెంబరు 2వ తేదీ వరకు మరో విడత ఆహార వేడుకను నిర్వహిస్తున్నట్లు ఎపిటిఎ సిఇఓ, ఎపిటిడిసి ఎండి హిమాన్హు శుక్లా తెలిపారు. తెలుగు సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న మన ఆహారం గురించి నేటి తరంతో పాటు, జాతీయ, అంతర్జాతీయ స్ధాయి పర్యాటకులకు పరిచయం చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపడుతుండగా, సాంవత్సరిక ప్రణాళిక మేరకు రాష్ట్రమంతా కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ సిద్దం చేసామన్నారు.
ఈ నేపధ్యంలో పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ నిజానికి ఆంధ్రా వంటలు ఎంతో రుచికరమైనవి, ఆరోగ్యకరమైనవి కాగా నేటి యువతరం జంక్ ఫుడ్ వైపు ఆకర్షితులు అవుతూ అనారోగ్యాన్ని ఆహ్వానిస్తున్నారన్నారు. ఆరోగ్యానికి అండగా నిలిచే ఆంధ్రా ఆహారాన్ని యువతకు పున:పరిచయం చేయటం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు సైతం పర్యాటక శాఖ పరోక్షంగా సహకరిస్తుందన్నారు. మరోవైపు స్థానిక వంటలుగా ప్రసిద్ధినొందినప్పటికీ పెద్దగా ప్రచారానికి నోచుకోని వంటలను గుర్తించి వాటికి కూడా ప్రాధన్యత తీసుకువచ్చేలా పర్యాటక శాఖ ప్రణాళిక సిద్దం చేసిందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. తెలుగునాట సుప్రసిద్ధ వంటకాలకు కొదవ లేదని, కాకుంటే అవి కనుమరుగవుతున్నయన్నారు.
తెలుగుదనం ప్రతిబింబించే వంటకాలను మరింతగా జన బాహుళ్యంలోకి తీసుకువెళ్లేలా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ నిరంతరం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఆంధ్రా ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ప్రపంచ వ్యాప్తంగా భిన్న రకాల వంటకాలను ఆహార ప్రియులు స్వాగతిస్తున్నా, పోషక విలువల పరంగా ఆంధ్రప్రదేశ్ వంటకాలు విభిన్నమైనవి. ఈ అంశాన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావటమే ప్రధాన ధ్యేయంగా పర్యాటక శాఖ ఈ వినూత్న కార్యక్రమాన్ని తీసుకుంది. పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా బాధ్యతలు చేపట్టిన తదుపరి పర్యాటక శాఖ పరంగా వివిధ పనులు వేగం పుంజుకోగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు సూచనల మేరకు ఈ ఆంధ్రా ఆహార పండుగలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.