తెలుగు సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న మన ఆహారం గురించి నేటి తరంతో పాటు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పర్యాటకులకు పరిచయం చేయాలన్న ఆలోచనతో ఆహార పండుగలు చేపడుతున్నామని పర్యాటక ప్రాధికార సంస్ధ ముఖ్య కార్యనిర్వహణ అధికారి హిమాన్హు శుక్లా తెలిపారు. సాంవత్సరిక ప్రణాళిక మేరకు రాష్ట్రమంతా కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ సిద్దం చేసామన్నారు. నగరంలోని హోటల్ డివి మేనర్‌లో ఆంధ్ర ఆహార పండుగను శనివారం శుక్లా ప్రారంభించారు.
సెప్టెంబరు 2వ తేదీ వరకు ఆహార వేడుకను నిర్వహించనున్నారు. పోషక విలువలతో కూడిన తెలుగు వంటకాలను ప్రపంచ పర్యాటకులకు చేరువ చేసే క్రమంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర ఆహార పండుగలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా శుక్లా పేర్కొన్నారు. నిజానికి ఆంధ్ర వంటలు ఎంతో రుచికరమైనవి, ఆరోగ్యకరమైనవి కాగా నేటి యువతరం జంక్ ఫుడ్ వైపు ఆకర్షితులు అవుతూ అనారోగ్యాన్ని ఆహ్వానిస్తున్నారన్నారు.
ఆరోగ్యానికి అండగా నిలిచే ఆంధ్ర ఆహారాన్ని యువతకు పున:పరిచయం చేయటం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు సైతం పర్యాటక శాఖ పరోక్షంగా సహకరిస్తుందన్నారు. మరోవైపు స్థానిక వంటలుగా ప్రసిద్ది నొందినప్పటికీ పెద్దగా ప్రచారానికి నోచుకోని వంటలను గుర్తించి వాటికి కూడా ప్రాధన్యత తీసుకువచ్చేలా పర్యాటక శాఖ ప్రణాళిక సిద్దం చేసిందన్నారు.
తెలుగునాట సుప్రసిద్ధ వంటకాలకు కొదవ లేదని, కాకుంటే అవి కనుమరుగవుతున్నయన్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. తెలుగుదనం ప్రతిబింబించే వంటకాలను మరింతగా జన బాహుళ్యంలోకి తీసుకువెళ్లేలా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ నిరంతరం వివిధ కార్యక్రమాలు చేపడుతుందని ఈ క్రమంలోనే ఆంధ్ర ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహించాలని ప్రభుత్వం భావించిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భిన్న రకాల వంటకాలను స్వాగతిస్తున్నా, పోషక విలువల పరంగా ఆంధ్రప్రదేశ్ వంటకాలు విభిన్నమైనవని, ఈ అంశాన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావటమే ప్రధాన ధ్యేయంగా పర్యాటక శాఖ ఈ వినూత్న కార్యక్రమాన్ని తీసుకుందని శుక్లా అన్నారు.
పర్యాటక శాఖ పరంగా వివిధ పనులు వేగం పుంజుకోగా, సిఎం చంద్రబాబు నాయిడు సూచనల మేరకు ఈ ఆంధ్ర ఆహార పండుగలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో డివి మేనార్ జిఎం రాజేష్,ఎపిటిడిసి జిఎంలు హరనాధ్, సుదర్శన్, విశ్వనాధం, ఎపిటిఎ సహాయ సంచాలకులు నిషార్ అహ్మద్, రాష్ట్ర పర్యాటక అధికారులు మధుబాబు, ప్రభాకర్, మార్కెటింగ్ అధికారులు పరమేశ్వరరావు, ఎస్టేట్ అధికారి శివరాం తదితరులు పాల్గొన్నారు.