ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రంలో బంద్ జరుగుతోంది. ఈ బంద్ కారణంగా గురువారం తెల్లవారుజాము నుంచే వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల ఎదుటా బైఠాయించిన సీపీఐ, సీపీఎం నేతలు, బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. రహదారులపై నిరసన తెలిపి ప్రైవేటు వాహనాలను కూడా ఎక్కడికక్కడ నిలిపేస్తుండటంతో జనజీవనం స్తంభించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బంద్‌కు మద్దతు పలికింది.
పలు ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగానే తమ దుకాణాలను మూసివేయగా, ప్రజలు కూడా బంద్‌లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కూడా మూతపడ్డాయి. అత్యవసర వాహనాలు మినహా మరే వాహనాలు రహదారులపై కనిపించడం లేదు.
ఈ బంద్‌కు అధికార టీడీపీ కూడా మద్దతు ప్రకటించింది. ఆ పార్టీకి చెందిన నేతలు పలు ప్రాంతాల్లో శాంతియుత ర్యాలీలు నిర్వహించారు. అలాగే, సినీ హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ కూడా ఈ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెల్సిందే.