మహనీయుడు పొట్టి శ్రీరాములు జయంతి: నివాళి అర్పించిన సీఎం జగన్

మంగళవారం, 16 మార్చి 2021 (11:49 IST)
"తెలుగుజాతి ఆత్మ గౌరవ ప్రతీక అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కృషి చేసి, ఆంధ్రరాష్ట్ర అవతరణకు బాటలు వేసిన ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.'' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేసారు.
 
పొట్టి శ్రీరాములుగారి పూర్వీకులు నెల్లూరు జిల్లాలోని పడమటపల్లెకు చెందినవారు. ఆయన తండ్రి గురవయ్య. తల్లి మహాలక్ష్మమ్మ. శ్రీరాములు గారి బంధువుల కుటుంబాలు మద్రాసులో వున్నందున గురవయ్య గారు కూడా మద్రాసులో స్థిరపడ్డారు. శ్రీరాములుగారు మద్రాసు జార్జిటౌన్ అణ్ణాపిళ్ళె వీధిలోని 165 నంబరు ఇంటిలో 1901 మార్చి 16వ తేదీన జన్మించారు. ఇరవై ఏళ్ళ వరకు శ్రీరాములు గారి విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది. 
 
బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ చదువు పూర్తి చేశారు. ​గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వేలో నెలకు రు.250/- జీతంగల ఉద్యోగంలో చేరారు. పాతికేళ్ల ప్రాయంలోనే ఆయన భార్య గతించింది. ఆ కారణంగా ఐహిక సుఖాలపట్ల ఆయనకు విరక్తి కలిగింది. తన జీవితాన్ని దేశానికి అంకితం చేయాలని నిశ్చయించారు.
 
స్వాతంత్య్ర సమరయోధుడు జతిన్‌దాస్‌ తరువాత అత్యంత సుదీర్ఘ కాలం నిరాహార దీక్ష చేసిన వారు అమరజీవి పొట్టి శ్రీరాములు ఒక్కరే. స్వాతంత్ర్యోద్యమ కాలంలోనే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి పునాదులు పడ్డాయి. 1912లో ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ప్రస్తావన వచ్చింది. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాష్ట్రాల విభజనను ఏ ప్రాతిపదికన నిర్ణయించాలనే అంశంపై నాటి కేంద్ర ప్రభుత్వం చర్చలు చేసింది. 
 
అవిభక్త మద్రాసులో వున్న తెలుగు వారు ఎప్పటినుంచో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుకుంటున్నారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొని కొందరు జాతీయ నాయకులు ప్రత్యేకాంధ్ర వైపు మొగ్గుచూపారు. అయితే, నాయకుల మధ్య అనైక్యత వల్ల 1952 వరకు ప్రత్యేకాంధ్ర కార్యరూపం దాల్చలేదు. పొట్టి శ్రీరాములు గాంధీజీ మార్గంలో పయనించి 1952 అక్టోబర్‌ 19న మద్రాసులో మహర్షి బులుసు సాంబమూర్తి ఇంటి వద్ద ఆమరణ నిరాహారదీక్షకు దిగారు.
 
దేశవ్యాప్తంగా ఎందరో జాతీయోద్యమనాయకులు ఈ దీక్షను సందర్శించారు. మద్దతుగా మరెంతో మంది ఆందోళనలు చేశారు. అయినా ప్రభుత్వం తేల్చలేదు. 58 రోజుల పాటు దీక్ష కొనసాగించి డిసెంబర్ 15న అసువులు బాశారు. ఆయన ప్రాణ త్యాగంతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం 1953 అక్టోబర్‌ 1న ఆంధ్ర రాష్ర్టాన్ని ఏర్పరిచింది. కర్నూలులో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయగా, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారు.
 
ఆంధ్రుల అంతిమ లక్ష్యమైన ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ ఒకటవ తేదీన హైదరాబాద్ రాజధానిగా అవతరించింది. మైలాపూర్ రాయపేట హైరోడ్‌లోని 126 నంబర్‌న పొట్టి శ్రీరాములుగారు కన్నుమూసిన ఇంటిని ఆ త్యాగమూర్తి స్మృతిచిహ్నంగా మన రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతూ వుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు