గత ఏడాది జనవరిలో ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం తెచ్చారు. రద్దు తీర్మానాన్ని జనవరి 27న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమో
దం కోసం పంపగా, గత 22 నెలలుగా అది కేంద్రం వద్దే పెండింగ్ లో ఉండిపోయింది. దాంతో శాసనమండలి కొనసాగింపుపై సందిగ్ధత ఏర్పడింది. ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడా సందిగ్ధత తొలగిపోయింది. మండలి రద్దును వెనక్కి తీసుకుంటున్నట్టు ఏపీ సర్కారు తీర్మానం చేయడంతో మండలిని యథావిధిగా కొనసాగించేందుకు మార్గం సుగమం అయింది.
గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికయిన వారు, ఇపుడు కొత్తగా ఎన్నిక అవుతున్నవారు అందరికీ ఇది ఒక తీపి కబురు. మండలిని పునరుద్ధరించడంతో, వారికి మళ్ళీ ఎమ్మెల్సీ పదవి యోగం కొనసాగింపుగా మారింది. మండలి రద్దుపై గతంలో టీడీపీ ఎంతో పోరాటం చేసింది. రద్దు కాకుండా, తమ పార్టీకే చెందిన శాసన మండలి ఛైర్మన్ సహాయంతో చక్రం తిప్పేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎంతో ప్రయత్నం చేశారు. కానీ, మొండి పట్టుదలతో మండలిని వై.ఎస్. జగన్ ప్రభుత్వం రద్దు చేస్తూ, తీర్మానం కాపీని కేంద్రం ఆమోదం కోసం పంపారు. కానీ, కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇంత వరకు స్పందించకపోవడంతో, తిరిగి మండలి రద్దు బిల్లును ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.