జీరో నుంచి హీరో... మొబైల్స్ తయారీలో నెంబర్ వన్ ఏపీ...
శనివారం, 15 సెప్టెంబరు 2018 (12:42 IST)
ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ప్రపంచంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. 2014లో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీరోలో ఉన్న గ్రోత్ 2018 నాటికి హీరో రేంజ్‌కి చేరింది. దీనికి వెనుక అదృశ్య హస్తం ఏమీ లేదు. ఐటీశాఖ మంత్రి లోకేష్ కృషి, ప్రభుత్వం పట్టుదల, అధికార యంత్రాంగం సహకారమే ఏపీని ఈ స్థాయికి చేర్చింది. ఇప్పుడు మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ ఏపీ. రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లయ్యింది. లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది దాటింది. ఇంత తక్కువ కాలంలో అనూహ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో పురోగతి వెనుక యువ మంత్రి లోకేష్ వ్యూహం, ప్రణాళిక, చొరవ ఉంది.
ఏమి చేయాలనుకుంటున్నాం.. వచ్చే పరిశ్రమలకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాం అనేది నిర్ణయించుకుని కార్యరంగంలోకి దిగారు లోకేష్. ఏపి ఎలక్ట్రానిక్స్ పాలసీని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. విదేశాల్లోనూ, దేశ వ్యాప్తంగా తిరుగుతూ అనేక ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల ప్రతినిధులు, అధిపతులతో సమావేశమయ్యారు. చెన్నై, బెంగళూరు కారిడార్‌ను సమర్థవంతంగా వినియోగించుకుంటూ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. రెండులక్షల మందికి ఉద్యోగాల కల్పించడమే లక్ష్యంగా, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మంత్రి నారా లోకేష్ పూర్తిస్థాయి ప్రణాళికతో విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు.
ఏపీ ఫస్ట్..
ఏ కంపెనీలైనా తమ యూనిట్లను స్థాపించాలనుకుంటున్న ప్రాంతంలో ఉన్న మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి? ప్రోత్సాహకాలు ఏం ఇస్తున్నారు? పాలసీలు ఎలా ఉన్నాయనేది చూస్తారు. వీటన్నింటినీ అధ్యయనం చేసిన లోకేష్ పారిశ్రామికవేత్తలకు కావాల్సినవన్నీ సమకూర్చగలిగారు. ఇక్కడే తొలి విజయం సాధించారు. ఎరేణిగుంటలో ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ 1,2 ఏర్పాటు చేశారు. సంస్థల స్థాపనకు భూముల కేటాయింపు పూర్తి అయిన తరువాతకావాల్సిన రోడ్లు, తాగునీటి సదుపాయం, 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నారు.
ఇప్పటివరకూ ఎలక్ట్రానిక్స్ రంగంలో 20 వేల ఉద్యోగాలు వచ్చాయి. ఈ ఉద్యోగాల్లో 90 శాతం మహిళలే ఉండటం గమనార్హం. ఫాక్స్ కాన్ కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద ఫోన్ల తయారీ కంపెనీల్లో ఒక్కటి. అలాంటి కంపెనీని రాష్ట్రానికి తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఒకేచోట 14 వేల మంది మహిళలు పనిచేస్తున్నారు. సెల్ కాన్, డిక్సన్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, కార్బన్ మొబైల్ తయారీ కంపెనీలు ఏపీలో తమ తయారీ యూనిట్లునెలకొల్పాయి.
రిలయన్స్ జియో రాక
సిఐఐ సమ్మిట్‌లో జరిగిన ఒప్పందం మేరకు రాష్ట్రంలో రిలయన్స్ జియో వివిధ దశల్లో 15 వేల కోట్లు పెట్టుబడులు పెట్టబోతోంది. తిరుపతి విమానాశ్రయం సమీపంలో 125 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఏర్పాటు కానుంది. రోజుకి 10 లక్షల జియో ఫోన్లు, సెట్ టాప్ బాక్సులు ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు జియో తయారు చేయనుంది. ఇక్కడ ఒకేచోట 25 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. రిలయన్స్ జియో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడానికి మంత్రి నారా లోకేష్ కీలకంగా వ్యవహరించారు. అక్టోబర్ 23, 2017న మంత్రి నారా లోకేష్ ముంబై పర్యటనలో భాగంగా రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీతో సుదీర్ఘంగా 2 గంటల పాటు భేటీ అయ్యారు. రాష్ట్రంలోఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు, రాయితీలు, పాలసీలు, క్లస్టర్ మోడల్ లోఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల గురించి లోకేష్ వివరించారు. దీంతో రిలయన్స్ జియో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
అందరి చూపు..ఏపీ వైపు
లిథియం ఐయాన్ బ్యాటరీ తయారీ కంపెనీ మునోత్ కూడా త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కి రాబోతుంది. ప్రపంచంలోనే ఐదు అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల్లో ఒక్కటైన కంపెనీ ఫ్లెక్స్ ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలు ప్రారంభించబోతుంది. రూ.585 కోట్లు పెట్టుబడి పెట్టి సుమారుగా 6,600 మందికి ఫ్లెక్స్ ట్రానిక్స్ ఉద్యోగాలు కల్పించనుంది. ఎలక్ట్రానిక్స్ డిజైన్ కంపెనీ ఇన్వెకాస్ రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టి 5 వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఉన్న అస్ట్రమ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో రూ.100 కోట్లపెట్టుబడితో స్థాపించే సంస్థలో1000 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది.
విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
స్థాపించే పరిశ్రమలకు మౌలిక సదుపాయాలతోపాటు మానవవనరులు కూడా అవసరం. అందుకే విద్యావంతులైన యువతను వృత్తి నిపుణులుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ, పరిశోధన, అభివృద్ధికి తోడుగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు మంత్రి లోకేష్. దీనికి రిలయన్స్‌తో సహా ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీలు సహకారం అందించనున్నాయి.