ఆ తెలుగు రాష్ట్రంలో మరణ మృదంగం... 'అన్నపూర్ణ' గడ్డపై అన్నదాతల ఆత్మహత్యలు
గురువారం, 3 సెప్టెంబరు 2020 (09:16 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా, తెలంగాణా కంటే.. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రోడ్డు ప్రమాదాలకు తోడు ఆర్థిక, మానసిక, అనారోగ్య సమస్యల కారణంగా వేలాది చనిపోతున్నారు. ఇలాంటి కారణాలతోనే రోజుకు సగటున 39 మంది చనిపోతున్నారు. గతేడాది 14 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని జాతీయ నేర గణాంకాల నివేదిక(ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం... అన్నపూర్ణగా పేరొందిన ఏపీ అన్నదాతల ఆత్మహత్యల జాబితాలో దేశంలోనే మూడో స్థానంలోనూ, వ్యవసాయ కూలీల విషయంలో రెండో స్థానంలో ఉంది.
ఏపీలో ప్రస్తుతం మొత్తం 13 జిల్లాలు ఉన్నాయి. గత యేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 24,619మంది క్షతగాత్రులు కాగా 7,984మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళన, అనారోగ్యంతో 6,465మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
మహిళలతో పోలిస్తే పురుషులు మానసిక బలవంతులన్న అధ్యయనాలను తల్లకిందులు చేస్తూ రాష్ట్రంలో 4,740 మంది పురుషులు బలవన్మరణానికి పాల్పడితే మహిళల సంఖ్య 1,725గా నమోదైంది. అనారోగ్యంతో 1,845మంది, కుటుంబ కలహాలతో 1,706మంది, ఆర్థిక ఇబ్బందులతో 828మంది, గృహిణులు 609మంది, నిరుద్యోగులు, విద్యార్థులు 597మంది ఇలా సగటున రోజుకు 17మంది తమ జీవితాలను అర్ధంతరంగా ముగించారు. ఉద్యోగంలో సంతృప్తి లేక 496మంది ఆత్మహత్య చేసుకున్నారు.
ఇకపోతే, భూమిని నమ్ముకొని జీవించే అన్నదాతలు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు గణనీయమైన సంఖ్యలో బతుకు చాలిస్తున్నారు. గతేడాది 1,029 మంది ఆత్మహత్యకు పాల్పడగా, వీరిలో రైతులు, సాగుదారులు 628 మంది ఉన్నారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉండగా సొంతగా భూమిని సాగుచేసే రైతుల ఆత్మహత్యలు 72కు పెరిగాయి.
2018లో రాష్ట్రంలో 199 మంది మరణించగా, 2019లో వారి సంఖ్య 438కి చేరింది. ఇక రాష్ట్రంలో గతేడాది జరిగిన 20,677 రోడ్డు ప్రమాదాల్లో అతివేగంతో 5,123మంది, నిర్లక్ష్య డ్రైవింగ్‌తో 2,277మంది ప్రాణాలు కోల్పోయారు.
రోడ్డు ప్రమాద మృతుల్లో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు(1,544) కాగా ఆ తర్వాత స్థానాల్లో కార్లు(585), ఆటోలు(492), ట్రాక్టర్ల(137)లో ప్రయాణించిన వారున్నారని నివేదిక స్పష్టం చేసింది.