ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మొత్తం 13 జిల్లాల్లో 11 జిల్లాలు రెడ్ జోన్లుగా ప్రకటించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మాత్రమే సేఫ్ జోన్లుగా ప్రకటించారు. ముఖ్యంగా ఏపీలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరించింది. ప్రారంభంలో ఈ వైరస్ అదుపులోనే ఉన్నట్టు కనిపించింది. కానీ, రోజులు గడిచే కొద్ది కరోనా వైరస్ వ్యాప్తికి ఆంధ్రప్రదేశ్ ఒక హాట్ స్పాట్‌గా మారింది.
దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 170 జిల్లాలను హాట్‌స్పాట్లుగా గుర్తించామని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రాలకు లేఖరాశారు. కేంద్రం ప్రకటించిన హాట్‌స్పాట్‌లన్నీ రెడ్‌జోన్ పరిధిలోకి వచ్చేవే. ఈ జాబితాలో ఏపీ నుంచి కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, కడప, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలు ఉన్నాయి.
అలాగే, ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదుకాని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మాత్రం సేఫ్‌జోన్‌లో ఉన్నాయి. 20కిపైగా కేసులు నమోదైన ప్రతీ జిల్లాను హాట్‌స్పాట్‌గా అందులోనూ అత్యధిక కేసులున్న ప్రాంతాలను హాట్‌స్పాట్ క్లస్టర్లుగా ప్రకటించారు. దేశం మొత్తమ్మీద 43 ప్రాంతాలు హాట్‌స్పాట్ క్లస్టర్లుగా వర్గీకరించారు. అయితే, ఏపీలో క్లస్టర్ ప్రస్తావన లేదు.
అంటే మొత్తం 11 జిల్లాలు హాట్‌స్పాట్ క్లస్టర్లుగానే భావించాల్సి ఉంటుంది. క్లస్టర్ అంటే జిల్లాలో కేసుల సంఖ్యభారీగా ఉన్న ప్రాంతాలతో కూడిన సముదాయం. ఈ నెల 20 నుంచి కేంద్రం ఇచ్చిన మినహాయింపులు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు మాత్రమే వర్తిస్తాయి.