తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశ విదేశాల్లో వున్న తెలుగు వారందరికీ ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా స్పీకర్ అభివర్ణించారు. భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తులు దీపావళి. జగతిని జాగృతం చేసే చెతైన్య దీప్తుల శోభావళి అని స్పీకర్ తెలిపారు.
చీకటిని తోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాలికల శోభతో వెలుగొందే గృహాలంకరణాలు, ఆనంద కోలాహలంతో వెల్లవిరిసే ఆబాలగోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్లు, ఈ దివ్య దీపావళి సోయగాలు అని స్పీకర్ కోడెల పేర్కొన్నారు.
ఈ పర్మదినం సందర్భంలో కనకదుర్గమ్మ, లక్ష్మీ మాత ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సిరిసంపదలు కలగాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిపథంలో ముందుండాలని వేడుకున్నట్లు తెలిపారు.