గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిలు సంతాపం వ్యక్తం చేశారు
సినీ నటుడు కోట శ్రీనివాస రావు మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఆయన మరణం విచారకరమన్నారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన కళా సేవ, పోషించిన పాత్రలు చిరస్మరణీయమని తెలిపారు.
ప్రతినాయకుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన పోషించిన ఎన్నో మధురమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. 1999లో విజయవాడ నుంచి కోట శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేశారని గుర్తుచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అలాగే, మరో సినీ నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ, కోట శ్రీనివాసరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సినీ పరిశ్రమ కోట కూలిపోయిందన్నారు. ఆయనతో వ్యక్తిగతంగా దశాబ్దాలకు పైగా పరిచయం ఉందన్నారు. సామాన్య మధ్యతరగతిలో పుట్టి అంచలంచెలుగా సినీ శిఖరంగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు.