నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం రెండేళ్ళ పసిపాప, ఈ రాష్ట్రాన్ని దేశంలో నంబవర్ స్థానంలో నిలబెడుతామని జిల్లా కలెక్టర్లకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడలో బుధవారం జిల్లా కలెక్టర్ల సదస్సు జరుగుతోంది. ఇందులో రెండేళ్ల పాలనపై సమీక్ష నిర్వహించారు. భవిష్యత్ ప్రణాళికలపై కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... విభజన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా నష్టాల్లో ఉందని... సమష్టి కృషితో గతం కంటే ఆర్థిక ఆదాయం 3.1శాతం పెంచుకోగలిగామన్నారు. గడిచిన రెండేళ్ల పాలనలో కలెక్టర్ల పనితీరు బాగుందని అభినందించారు. 2029 నాటికి దేశంలోనే అగ్రరాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు తెలిపారు.
అభివృద్ధి విషయంలో జిల్లా కలెక్టర్లు పోటీతత్వంతో పనిచేయాలన్నారు. అభివృద్ధిలో మండలాలు ఎక్కడ బలంగా ఉన్నాయి... ఎక్కడ బలహీనంగా ఉన్నాయో కలెక్టర్లు గుర్తించాలన్నారు. అన్ని జిల్లాల్లో దాదాపు 11 శాతం వృద్ధిరేటు సాధించినట్లు తెలిపారు వృద్ధిలో పరిశ్రమలు, సేవారంగాలు అగ్రస్థానంలో ఉన్నాయన్నారు.