ఆసక్తి రేపుతున్న సీఎం జగన్ ఢిల్లీ పర్యటన

సోమవారం, 26 ఆగస్టు 2019 (16:30 IST)
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది. పోలవరం రివర్స్ టెండర్లు, రాజధాని రగడ, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు.. ఇలా అనేక అంశాలపై రచ్చ రాజుకుంటున్న సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన చర్చకు కారణమైంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో హాజరయ్యేందుకు జగన్ సోమవారం ఢిల్లీ వెళ్లారు. అధికారుల బృందం కూడా ఆయనతోపాటు ఢిల్లీ చేరుకుంది.
 
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. మావోయిస్టుల కార్యకలాపాలు ఏవోబీలో నక్సల్స్ ఉనికి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. 
 
రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రత్యేకంగా గ్రేహౌండ్స్ ఏర్పాటు చేయడం, ఇందుకు సంబంధించిన నిధుల ప్రస్తావన ఈ సమావేశంలో చర్చకు రానుంది. సమావేశం ముగిసిన తర్వాత జగన్ కొంతమంది కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 
 
ముఖ్యంగా, పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌పై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆ శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను జగన్ కలవనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో జగన్ పూర్తి వివరాలతో కేంద్రమంత్రికి నివేదిక అందజేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. 
 
కేంద్రం వైఖరి తెలుసుకున్న తర్వాత హైకోర్టు ఇచ్చిన స్టేపై డివిజనల్ బెంచ్‌కు వెళ్లాలా? లేదా? అన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పీపీఏల పున:సమీక్షపై కూడా జగన్ తన వాదనను కేంద్రం ముందు వినిపించబోతున్నట్లు తెలియవచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు