జగనన్న స్వచ్ఛ సంకల్ప వాహనాల రంగులపై ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ సెటైర్లు విసిరారు. చెత్త వాహనాలకు కూడా వైసీపీ రంగులు వేసి తమది అసలైన చెత్త ప్రభుత్వమని ముఖ్యమంత్రి ప్రజలకు చెప్పకనే చెప్పారని వ్యాఖ్యానించారు. చెత్త వాహనాల రంగులపై బీజేపీ నేతల వ్యాఖ్యలు ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే, ఇంటి సూరిలో ఎదో కాలిందని మరొకరు ఏడ్చినట్లు ఉందన్నారు. ప్రజల డబ్బులతో కొనుగోలు చేసిన వాహనాలకు వైసీపీ రంగులు వేయడం ఏంటి? అని సుంకర పద్మశ్రీ ఆక్షేపణ వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి జగన్ లోటస్ పాండ్, తాడేపల్లి ప్యాలెస్ నుంచి డబ్బులు తీసి ఈ వాహనాలు కొనుగోలు చేశారా? అని పద్మశ్రీ ప్రశ్నించారు. అయినా చెత్త వాహనాలకు, చెత్త పార్టీ రంగులు కరెక్ట్ గా సూట్ అయ్యాయని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రంగుల పిచ్చిపై కోర్టు చీవాట్లు పెట్టినా, మా చెత్త పార్టీ రంగులు వదులుకోమని ప్రజలపై రుద్దుతూన్నారని ఎద్దేవా చేశారు. చెత్త వాహనాల మీద ప్రధాని బొమ్మ ఎక్కడ అని బీజేపీ నాయకుల మాటలు చూసి ప్రజలు నవ్వుతున్నారని బీజేపీకి ఆమె కౌంటర్ ఇచ్చారు. చెత్త వాహనాలపై బొమ్మలు, రంగుల కోసం వైసీపీ, బీజేపీ నేతలు పోటీ పడుతున్నారకని, రేపు ముఖ్యమంత్రి జగనన్న మరుగుదొడ్ల పథకం పెడితే, అక్కడ కూడా మోదీ ఫోటో కావాలని బీజేపీ నేతలు అడుగుతారేమో అని సెటైర్ విసిరారు సుంకర పద్మశ్రీ. 2024 ఎన్నికల్లో బీజేపీ, వైసిపి పార్టీలను ప్రజలు చెత్త బుట్టలో వెయ్యడం ఖాయమన్నారు.