బీసీల విదేశీ విద్యకు ఈ యేడు 69 కోట్ల కేటాయింపు... చంద్రబాబు నాయుడు
గురువారం, 27 అక్టోబరు 2016 (20:06 IST)
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు కొత్త నిర్వచనమిస్తోంది. రాష్ట్రంలోని బడుగులను సైతం ఇతర సామాజిక వర్గాలకు తీసిపోని విధంగా వారి భవిష్యత్ ను నిర్మించుకునేందుకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలతో సంక్షేమ యజ్ఞం చేస్తోంది. ఇప్పటికే బీసీ విద్యార్థులకు పెద్ద ఎత్తున స్కాలర్ షిప్ లు, ఫీజ్ రీఇంబర్స్మెంట్ పథకాలతో భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. బీసీ సామాజికవర్గాల నుంచి విదేశీ విద్య చదువుకునేందుకు అర్హత పొంది... పేదరికంలో ఉన్నవారికి సాయం చేయాలని నిర్ణయించింది. ఇందుకు కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఎన్టీఆర్ ఉన్నత విద్యాదరణ పేరుతో కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అర్హులకు అందించాలన్న సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
రెండు దఫాలుగా రూ. 10 లక్షల సాయం
వెనుకబడిన బీసీ కులాల్లోని విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకుగాను... రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విదేశాల్లో పోస్టు గ్రాడ్యూయేషన్ కోర్సు చేసే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల రూపాయల మేర ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఆయా అభ్యర్థులకు అంతే మొత్తంలో బ్యాంకు లోను పొందేందుకు అవసరమైన సహాయ సహకారాలను అధికారులు అందిస్తారు. రాష్ట్రంలో బీసీ విద్యార్థులను విదేశీ విద్యకు పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 29 ఈ ఏడాది ఆగస్టు 27న విడుదల చేసింది. ఏటా వెయ్యి మంది బీసీ విద్యార్థులను ఈ పథకం కింద విదేశాల్లో పోస్టు గ్రాడ్యూయేషన్ ఉన్నత విద్య చదివేందుకు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
35 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులు
ఆ పథకం కింద ఏడాదికి ఆరు లక్షల లోపు ఆదాయం ఉన్నవారు అర్హులు. వారి కుటుంబ సభ్యుల ఆదాయం ఆరు లక్షలకు మించరాదు. ఏటా జులై1 నాటికి ఈ స్కీము కింద చదువుకునే వారి వయసు 35 ఏళ్ల లోపు ఉండాలి. ఎన్టీఆర్ విద్యాదరణ పథకం కింద రెండు దఫాలుగా ఫీజు చెల్లిస్తారు. విదేశాల్లో విద్య కోసం అనుమతి పొందిన వారికి మొదట దఫా కింద రూ. 5 లక్షలు చెల్లిస్తారు. మొదటి సెమిస్టర్ ఫలితాల తర్వాత రెండో దఫా మొత్తం రూ. 5 లక్షలను చెల్లిస్తారు. ఈ పథకం కింద విద్యార్థులు అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజీలాండ్, స్వీడన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, డెన్మార్క్, రష్యా, ఫిలిప్పీన్స్, కజకిస్తాన్, చైనా వెళ్లేందుకు అనుమతిస్తారు. ఫిలిప్పీన్స్, కజికిస్తాన్, చైనా లో కేవలం వైద్య సంబంధిత కోర్సులకు మాత్రమే అనుమతిస్తారు.
త్వరలోనే మూడో దఫా ఎంపిక
ఈ పథకం కోసం స్టేట్ లెవల్ సెలక్షన్ కమిటీ విజయవాడలో ఇప్పటికి రెండు సార్లు కౌన్సిలింగ్ నిర్వహించింది. మొదటసారి సెలక్షన్లో 64 మందికి విదేశీ విద్యకు బీసీ సంక్షేమ శాఖ ఆమోదం తెలిపింది. వీరంతా ఆయా దేశాల్లో విదేశీ విద్యను అభ్యసిస్తున్నారు. ఈనెల 25న మరో 110కి విదేశీ విద్యకు ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇప్పటి వరకు మొత్తంగా 174 మంది విద్యార్థులను విదేశీ విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎంపిక చేసిన మిగతా 42 మందిని త్వరలోనే ఎంపిక చేయనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. విద్యార్థుల ఎంపిక ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆయన వివరించారు.
ఈ యేడు రూ. 69 కోట్ల 10 లక్షల కేటాయింపు
2016-17 సంవత్సరానికి గాను... రూ. 69 కోట్ల 10 లక్షల 64 వేల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ప్రతి ఒక్క విద్యార్థికి రూ. 10 లక్షల మొత్తాన్ని సాయంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసిన జీవో నిబంధనల ప్రకారం నిర్దేశిత ఆదాయ పరిమితి ఉన్న అభ్యర్థులను పూర్తి స్థాయిలో క్షణ్ణంగా పరిశీలించి విదేశీ విద్య కోసం బీసీ సంక్షేమ శాఖ ఎంపిక చేస్తుంది.
బీసీల భవిష్యత్ కోసం ప్రభుత్వ పథకాలు
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు కొత్త నిర్వచనమిస్తోంది. రాష్ట్రంలోని బడుగులు సైతం ఇతర సామాజికవర్గాలకు తీసిపోని విధంగా భవిష్యత్ ను నిర్మించుకునేందుకు కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. ఇప్పటికే బీసీ విద్యార్థులకు పెద్ద ఎత్తున స్కాలర్ షిప్ లు, ఫీజ్ రీఇంబర్స్మెంట్ పథకాలతో పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తున్న ప్రభుత్వం బీసీ సామాజికవర్గాల నుంచి విదేశీ విద్య చదువుకునేందుకు కావాల్సి నిధులను సైతం అందిస్తోంది. ఎన్టీఆర్ ఉన్నత విద్యాదరణ పేరుతో కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అర్హులకు అందించాలన్న సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
విద్యార్థుల ఎంపిక ప్రక్రియ నిరంతరం
ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలతో ఆయా వర్గాల ప్రజలకు సహాయ సహకారాలందిస్తున్నరాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను విదేశీ విద్యకు నిధులు అందిస్తున్న ప్రభుత్వం తాజాగా పెద్ద ఎత్తున కాపు విద్యార్థులకు విదేశీ ఉన్నత విద్య స్కీముతో పలువురు విద్యార్థులను విదేశాలకు పంపిస్తోంది. బీసీ విద్యార్థులను వచ్చే రోజుల్లో భారీగా విదేశాలకు పంపి ఆయా కులాల్లో వెలుగులు నింపాలని సర్కారు తలపోస్తోంది.
బీసీల రుణం తీర్చుకోలేనిది: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఉన్నత విద్యాదరణ పధకానికి అర్హులైన విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల సాయం ప్రభుత్వం చేస్తోందని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. బీసీల అభ్యున్నతి కోసం ఎంత సాయమైనా అందిస్తామని... నిధుల సమస్య లేనే లేదని సీఎం తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన బీసీ కులాలకు ఎంత సాయం చేసిన వారి రుణం తీర్చుకోలేనని... విదేశీ విద్యకు ఎంపిక చేసిన 110 విద్యార్థులను కలిసిన సందర్భంగా ముఖ్యంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఇంకా ఎంత మంది విదేశీ విద్యకు అర్హులో వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాయమందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఔదార్యం పట్ల విద్యార్థినీ, విద్యార్థులు ఉద్వేగానికి లోనయ్యారు. విదేశీ విద్య ద్వారా తాము రాష్ట్రానికి గుర్తింపు తీసుకొస్తామని ఈ సందర్భంగా వారు చెప్పారు.