ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల టైంటేబుల్‌ను ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మార్చి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. అలాగే, పదో తరగతి పరీక్షలను మార్చి 18వ తేదీ 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు వరకు నిర్వహిస్తారు.
ఈ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఏప్రిల్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, అందువల్ల ఈ లోపు రాష్ట్రంలో 10, 12వ తరగతి పబ్లిక్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ పరీక్షలను పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ముందుగా ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులంతా కష్టపడి చదివి, విద్యార్థులంతా 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆయన ఆకాక్షించారు.