రేపటి నుంచి అమల్లోకి "సిమ్స్ - ఏపీ" - ఒక్క నిమిషం ఆలస్యమైనా..
సోమవారం, 15 ఆగస్టు 2022 (11:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు చిక్కులు ఎదురుకానున్నాయి. టీచర్ల హాజరు కోసం ఫేషియల్ రికగ్నేషన్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ విధానం వల్ల ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆబ్సెంట్ కిందే లెక్క వేస్తారు. అంతేకాకుండా పాఠశాల సిబ్బంది అందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఏపీ విద్యా శాఖ ఆదేశించింది.
పని రోజుల్లో ఉదయం 9 గంటల్లోపు స్కూలులో ఫోటో తీసుకుని అప్‌లోడ్ చేయాల్సివుంటుంది. పైగా, ఎక్కడినుంచైనా అప్‌లోడ్ చేస్తామంటే కుదరదు. పాఠశాల ముందు నిలబడి ఫోటో తీసి పంపించాల్సి ఉంటుంది. అయితే, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ లేనివారి పరిస్థితి ఏంటన్నది ఇపుడు ఆందోళనకరంగా మారింది.
ఇందుకోసం సిమ్స్-ఏపీ అనే మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఉపాధ్యాయులు సహా పాఠశాలల్లో పనిచేసే అందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
తొలుత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తన లాగిన్‌లో పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు నమోదు చేయాల్సి ఉంటుది. వారికి ఎన్ని సెలవులు ఉన్నాయో కూడా అందులో పేర్కొనాలి. అనంతరం వారి ఫొటోలను మూడు యాంగిల్స్‌లో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత వారు పాఠశాలకు వచ్చిన వెంటనే యాప్‌లో లాగిన్ అయి ఫొటో తీసుకుని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఉదయం 9 గంటలలోపే చేయాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా యాప్ అంగీకరించదు. ఫలితంగా ఆబ్సెంట్ పడుతుంది. కాబట్టి లీవ్ పెట్టుకోవాలని సూచిస్తుంది.
అలాగే, ఎక్కడున్నా 9 గంటలలోపు ఫొటో తీసుకుని అప్‌లోడ్ చేస్తామంటే కుదరదు. జీపీఎస్ ఆధారంగా ప్రతి పాఠశాలను గుర్తిస్తారు. కాబట్టి పాఠశాల ఆవరణలోనే ఫొటో తీసుకోవాల్సి ఉంటుంది. అంటే, ఉపాధ్యాయులు ఖచ్చితంగా 9 గంటలలోపు స్కూల్లో ఉండాల్సిందే.
బయోమెట్రిక్ యంత్రాలు సరిగా పనిచేయకపోవడం వల్లే సిమ్స్-ఏపీ యాప్‌ను తీసుకొచ్చినట్టు ప్రభుత్వం చెబుతున్నా.. స్మార్ట్‌ఫోన్ లేని ఉపాధ్యాయుల సంగతేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏజెన్సీ, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్య ఉంటుందని, అప్పుడెలా అని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.
దీనికి తోడు ట్రాఫిక్ ఇబ్బందులు, బస్సుల ఆలస్యం వంటి సమస్యలు కూడా ఉంటాయంటున్నారు. ఈ నేపథ్యంలో సిమ్స్-ఏపీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ప్యాప్టో) ఉపాధ్యాయులకు పిలుపునిచ్చింది.