ఈ పథకం ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 3,27,244 మంది పేద మహిళలకు రూ. 490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించింది. అయితే బ్యాంకులు పాత అప్పుల కింద ఈ డబ్బును జమ చేసుకోకుండా అన్ ఇన్కమ్బర్డ్ ఖాతాల్లో నగదును జమ చేశారు.
ఈ డబ్బు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసిన తర్వాత సీఎం జగన్ మాట్లాడుతూ, నిరుపేదలైన కాపుల కోసం వైయస్సార్ కాపు నేస్తాన్ని అందిస్తున్నామన్నారు. అర్హులైన కాపు మహిళలకు ప్రతి ఏటా రూ.15 వేల చొప్పున... ఐదేళ్లలో రూ.75 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సాయాన్ని అందిస్తామని, అర్హత లేని ఏ ఒక్కరికీ ఈ పథకాన్ని వర్తింపజేయబోమన్నారు. రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ... వెనకడుగు వేయకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నామని జగన్ తెలిపారు. గత ప్రభుత్వం ఏం చేసిందో అందరూ గుర్తుకు తెచ్చుకోవాలని... ప్రతి ఏటా రూ.1,500 కోట్లు ఇస్తామని చెప్పి ఏడాదికి కనీసం రూ.400 కోట్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కానీ, తాము అలా చేయబోమని సీఎం జగన్ అన్నారు.