మెట్టు దిగిన జగన్ సర్కారు.. ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా!

సోమవారం, 3 మే 2021 (10:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ మెట్టు దిగింది. పరీక్షలను నిర్వహించాలంటూ మంకుపట్టుపట్టిన ప్రభుత్వం.. ఎట్టకేలకు తన తన నిర్ణయాన్ని పునఃపరిశీలించి, ఇంటర్ పరీక్షలను వాయిదావేసింది. పరిస్థితులు చక్కబడిన తర్వాత కొత్తతేదీలు ప్రకటించి పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది. 
 
షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 5 నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. ఇంతటి కొవిడ్‌ ఉధృతిలోనూ పరీక్షలు నిర్వహించాల్సిందేనన్న ప్రభుత్వ వైఖరి ఎలా పిల్లలు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఇంటర్‌ పరీక్షలు వాయిదా లేక రద్దు చేయాలంటూ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కొందరు నిరాహార దీక్షనూ చేపట్టారు. 
 
దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కితగ్గింది. అదేసమయంలో పరీక్షలు రద్దు మాత్రం చేయట్లేదని, పరిస్థితులు చక్కబడిన తర్వాత కొత్త తేదీలు ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
 
'పిల్లల ప్రాణాలపైనా, వారి భవిష్యత్తుపైనా మమకారం ఉన్న ప్రభుత్వంగా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. ఇందుకోసం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశాం. అయితే దేశంలో, రాష్ట్రంలో పెరిగిపోతున్న కొవిడ్‌ కేసులు, దీనిపై వస్తున్న వార్తల పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. ఈ నేపథ్యంలోనే పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాలని హైకోర్టు అభిప్రాయపడింది. కోర్టు అభిప్రాయాన్ని గౌరవిస్తూ వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నాం' అని మంత్రి వెల్లడించారు. 
 
పరిస్థితులు చక్కబడిన తర్వాత కొత్త తేదీలు ప్రకటిస్తామని, ఇదే విషయాన్ని సోమవారం కోర్టుకు కూడా వివరిస్తామని ఆయన పేర్కొన్నారు. 'ఇంటర్‌ తర్వాత పైచదువుల కోసం రాసే పరీక్షల్లో ఇంటర్‌ మార్కులను ప్రామాణికంగా తీసుకుంటారు. ఆ మార్కులే వారి పైచదువులకు, ఉద్యోగాలకు కీలకం. అందుకే మన పిల్లల భవిష్యత్తు కోసం పరీక్షలు నిర్వహించాలని ఈ ప్రభుత్వం ఇంతగా తాపత్రయపడింది' అని ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. 
 
మరోవైపు, ఇంటర్మీడియట్‌ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసిన నేపథ్యంలో సోమవారం నుంచి అన్ని జూనియర్‌ కాలేజీలకు సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. తిరిగి పరీక్షల తేదీలు ప్రకటించే వరకూ కాలేజీలకు సెలవులు ఉంటాయని తెలిపింది. అలాగే విద్యాశాఖ మంత్రి ప్రకటనకు అనుగుణంగా ఇంటర్‌ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు