అమర రాజా బ్యాటరీస్‌ మూసివేతకు కాలుష్య నియంత్రణ మండలి నోటీసు

ఆదివారం, 2 మే 2021 (11:22 IST)
చిత్తూరు జిల్లాలోని కరకంబాడి, నూనెగుండ్లపల్లిలో స్థాపించిన అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్(ఏఆర్బిఎల్)ను మూసి వేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణా మండలి నుండి ఏప్రిల్ 30వ తేదీన ఆదేశాలు అందాయి. 
ఈ మేరకు మండలి ఆదేశాలపై యాజమాన్యం పూర్తి స్థాయిలో సమీక్షించింది. వాటాదారుల ప్రయోజనాలే ప్రథమ కర్తవ్యంగా అమరరాజా గత 35 సంవత్సరాలుగా అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిందని పేర్కొంది. 
 
దేశ విదేశాలలో అతి కీలకమైన రంగాలైన రక్షణ, వైద్య, టెలికాం విభాగాలలో కంపెనీ ఉత్పత్తులను అందజేస్తూ, వాణిజ్య, సామాజిక, పర్యావరణ సంరక్షణలో ఖచ్చితమైన నియమ, నిబంధనలను పాటిస్తూ సమాజ స్ఫూర్తిదాయక విలువలను సంస్థ  ఎల్లప్పుడూ పాటిస్తూ ఉద్యోగుల, సమాజం, వాటాదారుల యొక్క ప్రయోజనాలని పరిరక్షిస్తూనే ఉన్నట్టు పేర్కొంది. 
 
కాలుష్య నియంత్రణా మండలి ఆదేశాలపై ఆధారపడి వినియోగదారులు, సరఫరాదారులు, భాగస్వాముల ప్రయోజనాలకు ఆటంకాలు కలగకుండా అమర రాజా బ్యాటరీస్ అన్ని చర్యలు చేపట్టిందనీ, ప్రస్తుత కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మా యొక్క సరఫరాలకు ఎటువంటి  అంతరాయం కలిగిన అది తీవ్ర నష్టాన్ని కలుగచేస్తుందని తెలిపింది. 
 
కంపెనీ ఆధారిత రంగాలు బ్యాటరీల సరఫరాకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, అన్ని మార్గాలను పరిశీలిస్తోంది. కంపెనీ సరఫరా చేస్తున్న ప్రధాన వినియోగదారులకు లోటుకలుగకుండా చేయటానికి నియంత్రణా మండలి అధికారులతో చర్చలు సాగిస్తున్నట్టు తెలిపింది.  
 
అనేక సంవత్సరాలుగా వివిధ వార్షిక/ద్వైవార్షిక పర్యావరణ ఆడిట్లు, ధ్రువపత్రాలు సంస్థ కలిగివుంది. భద్రత, పర్యావరణ రక్షణలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులను అందుకున్నాం. పర్యావరణం, ఆరోగ్యం, భద్రత యొక్క అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉన్నట్టు పేర్కొంది. 
 
వాటాదారుల ప్రయోజనానికి నిబద్దతతో వ్యవరిస్తామని కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ సంస్థ యొక్క కార్యక్రమాలు అన్ని సామజిక, పర్యావరణ సంరక్షణ అనే అంశాల ఆధారంగా ఆచరిస్తున్నట్టు తెలిపారు. అమర రాజా సంస్థ పర్యావరణ పరిరక్షణ చర్యలు  పాటిస్తూ, వివిధ రకాలైన కార్యక్రమాలు, సంస్థ ప్రమాణాలు, చట్ట ప్రకారం చేయవలసిన కార్యక్రమాలు, సంస్థాగతంగా చేపట్టిన  అభివృద్ధి కార్యక్రమాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులకి తెలియజేస్తామని అమర రాజా బ్యాటరీ సంస్థ తన ప్రకటనలో వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు