మూడు రాజధానుల ముచ్చట తీర్చుకుంటాం : మంత్రి బొత్స

మంగళవారం, 8 మార్చి 2022 (13:46 IST)
తమ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడివుందని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. త్వరలోనే అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయంపై కేంద్రం నియమించిన జస్టిస్ శివరామకృష్ణన్ కమిటీ కూడా పాలనా వికేంద్రీకరణను ప్రస్తావించిందని గుర్తుచేశారు. నాడు అధికారంలో ఉన్న టీడీపీ శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. 
 
పైగా మూడు రాజధానుల అంశంలో తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయమే తమకు శిరోధార్యమన్నారు. ఈ విషయంలో టీడీపీ నేతలు చేసే విమర్శలను అస్సలు ఏమాత్రం పట్టించుకోబోమని ఆయన స్పష్టంచేశారు. 
 
పైగా, మూడు రాజధానుల అంశంపై హైకోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై న్యాయనిపుణులతో సంప్రదించి ముందుకెళ్తామని ఆయన వెల్లడించారు. 
 
ప్రస్తుతం సీఆర్డీఏ చట్టం అమల్లో ఉందని చెప్పిన మంత్రి బొత్స.. గతంలో అమరావతి రాజధాని భూములు టిడ్కోకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  తనాఖా పెట్టారని గుర్తుచేశారు. అందువల్ల ఇపుడు తాము తనాఖా పెడితే తప్పేమీ లేదన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు