గత ఐదేళ్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకేళ్లలో చిక్కుకుని విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇపుడు విముక్తి లభించిందని మంత్రి సత్యకుమార్ అన్నారు. మూడు రాజధానుల పేరుతో జగన్ సర్కారు రాష్ట్రంలో వికృత రాక్షస క్రీడకు పాల్పడిందని ఆయన ధ్వజమెత్తారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి బీజేపీ ఎమ్మెల్యేగా ఓ లేఖ రాశారు.
రాజధాని అమరావతిని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం ద్వారా ఏపీకి వైసీపీ దారుణ నష్టాన్ని మిగిల్చిందన్నారు. అమరావతి అభివృద్ధి కోసం 2014 నుంచి 2019 వరకు రూ.10,000 కోట్లకు పైగా ఖర్చు చేయడంతో చాలా భవనాలు, నిర్మాణాలు అభివృద్ధి వివిధ దశల్లో ఉన్నాయన్నారు.
కానీ వీటిని వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ నిలిచిందని, ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో, ప్రజల అభివృద్ధి ఆకాంక్షలను ముందుకు తీసుకువెళ్లడానికి ఇటు ఏపీలో, అటు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు మళ్లీ అధికారంలోకి వచ్చాయన్నారు.
అందులో భాగంగానే అమరావతి అభివృద్ధికి బడ్జెట్లో రూ.15 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారన్నారు. అవసరమైనప్పుడు మరింత సాయానికి కూడా కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించిందని గుర్తు చేశారు. రాజధానిని త్వరితగతిన అభివృద్ధి చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. త్వరితగతిన రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం కేంద్రం ప్రదర్శించిన నిబద్ధతకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.