రాజీనామా చేసిన ఇద్దరు మంత్రుల స్థానాన్ని భర్తీ చేసేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ఆషాఢమాసం ముగిసిన తర్వాత శ్రావణమాసం ప్రారంభంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముందని సమాచారం.
కాగా శ్రావణ మాసం 21వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. దీంతో 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే వీలున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు నేతలు బీసీ వర్గానికి చెందినవారు.
కొత్త మంత్రులను కూడా బీసీ వర్గం నుంచే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక చేస్తారని భావిస్తున్నారు. ఇద్దరు మంత్రులు.. మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేసిన విషయం విదితమే.
ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి వీలుగా విస్తరణ చేపట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఆశావహులు సీఎం దృష్టిలో పడేందుకు రకరకాల ప్రయత్నాలు మొదలు పెట్టారు.