ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పూర్తి వివరాలు వచ్చేశాయి. రేపు ప్రమాణం చేయబోయేవారి వివరాలు వెల్లడయ్యాయి. ఐతే ఈ జాబితాలో ఖచ్చితంగా పేర్లు వుంటాయని అనుకున్న భూమన కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజా పేర్లు లేవు. దీనితో ఒకింత ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి కూర్పు చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. బహుశా... అందుకేనేమో... నిన్న భూమన కరుణాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఇక పోటీ చేయబోను అని చెప్పేశారు. అలాగే రోజా కూడా మౌనం దాల్చారు. మరి వీరికి జగన్ చెప్పినట్లు నెక్ట్స్ బంచ్‌లో... అంటే మరో రెండున్నరేళ్ల తర్వాత ఇస్తారేమో చూడాలి.
ఇకపోతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కేబినెట్‌లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించారు. బీసీలకు పెద్దపీట వేశారు. ఎనిమిది మంది బీసీలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. రెడ్డి, కాపు సామాజిక వర్గానికి నాలుగేసి కేబినెట్ బెర్త్‌లు కేటాయించారు. ఎస్సీలకు 5 మంత్రి పదవులు కేటాయించారు. క్షత్రియ, కమ్మ, వైశ్య, మైనారిటీ సామాజిక వర్గాలకు ఒక్కో బెర్త్ దక్కింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేను శాసనసభ ఉపసభాపతిగా నియమించనున్నారు.