ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం ఏర్పాటుకానుంది. శనివారం ఉదయం 11.29 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో రాష్ట్ర గవర్నర్ నరసింహం ప్రమాణం చేయిస్తారు. అయితే, జగన్ తన మంత్రివర్గాన్ని 25 మందితో ఏర్పాటు చేయనున్నారు. వారిలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు కాగా, 20 మంది మంత్రులుగా ఉంటారు.
ఉప ముఖ్యమంత్రులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారిని ఎంపిక చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రలుగా ప్రమాణం చేసే వారిలో ఈ ఐదుగురు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంజాద్ బాషా(మైనార్టీ), సుచరిత(ఎస్సీ), ఆళ్ల నాని(కాపు), పార్థసారథి(యాదవ), రాజన్న దొర(ఎస్టీ)ను డిప్యూటీ సీఎంలుగా ఎంపిక చేసే అవకాశం ఉంది.
మంత్రివర్గంలో 50 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉంటారని జగన్ తెలిపారు. రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంత్రులను మారుస్తాం. అప్పుడు కొత్త వారికి అవకాశం కల్పిస్తామన్నారు జగన్. మే 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఏపీ అసెం ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 151, టీడీపీ 23, జనసేన 1 స్థానంలో గెలిచింది.