నిన్న విశాఖ ఎయిర్ పోర్టులో పోలీసులతో వైకాపా చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహావేసాలను వెల్లడించినట్లు ప్రధాన పత్రికల్లో కనబడుతోంది. నగరంలో 144 సెక్షన్ అమలులో వున్న నేపధ్యంలో జగన్ మోహన్ రెడ్డిని విమానాశ్రయంలోనే పోలీసులు నిలిపివేశారు. ఆ సమయంలో జగన్ మోహన్ రెడ్డి 'సీఎంను టచ్ చేస్తున్నావ్. నిన్ను గుర్తు పెట్టుకుంటా' అని అన్నట్లు ప్రధాన పత్రికలో పతాక శీర్షికలో టైటిల్ పెట్టారు. మరి నిజంగా జగన్ మోహన్ రెడ్డి అలా అన్నారా... లేదంటే కాబోయే ముఖ్యమంత్రిని అన్నారో తెలియడంలేదు.
మొత్తమ్మీద ప్రత్యేక హోదా ఉద్యమంలో జగన్ మోహన్ రెడ్డి తనదైన మార్కును కొట్టేస్తున్నట్లు కనిపిస్తోంది. భవిష్యత్తులో జగన్ మోహన్ రెడ్డి ఇదే దూకుడుతో ముందుకు వెళితే అధికారం ఆయనదేననే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెదేపా-భాజపా ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఎన్నికల వేళ హామీ ఇచ్చారని, ఆ పార్టీ మిత్రపక్షం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పదేపదే చెప్పడంతో ఇపుడు రాష్ట్రంలో ఆ రెండు పార్టీలపై ప్రజలకు క్రమంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం తెదేపాకు ఇబ్బందులు తప్పవు.