జిల్లా ఆసుపత్రుల్లో క్యాన్సర్ నివారణకు ఏర్పాట్లు..

గురువారం, 25 జులై 2019 (07:58 IST)
రాష్ట్రంలో వ్యాధుల నియంత్రణకు సంబంధించి కార్యాచారణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆరోగ్య సంస్కరణలపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఛైర్ పర్సన్, రిటైర్డ్  ఐఎఎస్ అధికారి సుజాతారావు సూచించారు. వ్యాధుల నియంత్రణపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆమె పలు సూచనలు చేశారు. అంటు రోగాలు, ఇతర రోగాల విషయంలో  ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న పలు పథకాలు, కార్యక్రమాలపై ఆమె లోతుగా చర్చించారు. 
 
శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై  జార్జ్  ఇన్సిటిట్యూట్ (ఢిల్లీ)కు చెందిన డాక్టర్ వివేకానంద ఝా తాను పరిశీలించిన అంశాలను వివరించారు. ఉద్దానంలో ప్రధానంగా నీటి నాణ్యత విషయంలో అక్కడి ప్రజల్లో ఆందోళన చెందుతున్నారని, భూగర్భ జలాల్లో మోతాదుకు మించి  క్రోమియం, ఫ్లోరైడ్, సిలికా ఉండడమే ఇందుకు కారణమన్నారు. చాలా కాలంగా దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయని, రెండేళ్లుగా ఐసిఎంఆర్ బృందాలు, ఇతర సంస్థలు చేసిన పరిశోధనల వివరాల్ని అందించాయన్నారు. 
 
నీటి నాణ్యత పెరిగితే చాలా వరకు కిడ్నీ బాధితుల సంఖ్య తగ్గుతుందన్నారు. ప్రధానంగా స్థానికుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. ముఖ్యంగా స్కూళ్లపై  దృష్టి సారించాలన్నారు. కమ్యూనిటీ డయాలసిస్ యూనిట్లు మరిన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సరిపడా నెఫ్రాలజిస్టుల్ని కూడా నియమించాలన్నారు. ప్రస్తుతం డయాలసిస్ ప్రక్రియను ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారని సుజాతారావు ఆరా తీశారు. 
 
కిడ్నీ రోగుల చికిత్సా విధానాన్ని వికేంద్రీకరణ చేయాలన్నారు. దీనిపై సమగ్ర నివేదికను తయారు చేసి అందజేయాలని ఆమె కోరారు. కిడ్నీ రోగులకు నెలకు 10,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం మంచి ఆలోచనని పలువురు సభ్యులు అభినందించారు. కిడ్నీ రోగులకు సేవలందించేందుకు ఎఎన్ఎం, పిహెచ్ సి డాక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. 
 
రాష్ట్రంలో అంధత్వ నివారణకు తీసుకుంటున్న చర్యలపై సుజాతారావు ఆరా తీశారు. తెలంగాణాలో అమలవుతున్న కంటివెలుగు పథకం చాలా బాగుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ సభ్యులతో అన్నారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీలో అంధత్వ నివారణకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని, దీనిపై సీఎంకు వివరించాల్సి ఉందన్నారు. ప్రైవేటు సంస్థల్లో ఎక్కువగా కాటరాక్ట్ ఆపరేషన్లు జరుగుతున్నాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా తక్కువగా చేయడానికి కారణాలేంటని  ఆమె ప్రశ్నించారు. 
 
దాదాపుగా 50 సెకండరీ విజన్ సెంటర్లు పెట్టాలని, ఇందుకోసం 5 కోట్ల రూపాయలు కావాలని ప్రతిపాదించామని అధికారులు తెలిపారు. సరిపడా ఎక్విప్ మెంట్  లేకపోవడమే  ఆశించిన మేర కాటరాక్ట్ ఆపరేషన్లు చేయలేకపోతున్నామన్నారు. ఏపీలో రెండు ప్రాంతీయ కంటి ఆసుపత్రులున్నా ప్రయోజనం లేకుండా పోతోందని సుజాతారావు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని రుయా వంటి  ఆసుపత్రిలో  కూడా కాటరాక్ట్  ఆపరేషన్లు చేయడంలేదని ఒక సభ్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఎంఎస్ పూర్తి చేశాక ఆరు నెలల పాటు ఫెల్లోషిప్ చేయిస్తే కేటరాక్ట్ ఆపరేషన్లు చేయడానికి వీలవుతుందని ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. అలాగే ఎఎన్ఎం, ఆశా వర్కర్లకు మూడు నెలల విజన్ ట్రయినింగ్ కూడా ఇస్తే మరింత ప్రయోజనం వుంటుందని సుజాతారావు అన్నారు. అలాగే 104 సంచార వాహనాల ద్వారా విజన్ టెస్ట్ లు చేయించాలని, అంధత్వ నివారణపై విస్తృత స్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తే ఎలా వుంటుందో కూడా సూచించాలని ఆమె కోరారు. దీనిపై ఎల్లుండి లోగా  ముఖ్యమంత్రికి ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని, తగిన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా వుండాలని అధికారులకు ఆమె సూచించారు. 
 
ప్రత్యేకించి పిహెచ్ సి ల స్థాయిలో ఇందుకోసం సౌకర్యాల్ని కల్పించాలని చర్చకు వచ్చింది. అలాగే హైపర్ టెన్షన్, డయాబెటీస్ పై కూడా చర్చించారు. ఏపీలో ప్రతి నలుగురిలో ఒకరికి, తెలంగాణాలో ప్రతి ఐదుగురిలో ఒకరికి హైపర్ టెన్షన్ ఉందని డాక్టర్ శైలజ వివరించారు. ఎన్ సిడిపి కింద మరో నర్స్ ను పిహెచ్ సి స్థాయిలో నియమించాలని సూచించారు. ప్రపంచ  ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం డిజిటల్ మోడల్ హైపర్ టెన్షన్ మెషీన్ లను ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా వుంటుందని చర్చకు వచ్చింది. కేరళ లో డయాబెటీస్, హైపర్ టెన్షన్ కు ఒకే కార్డుతో సేవలందిస్తున్నారని సభ్యులు తెలిపారు. ఏపీలో కూడా ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డు జారీ చేస్తే రోగికి సంబంధించిన సమాచారం అందుబాటులో వుంటుందని సుజాతారావు అభిప్రాయపడ్డారు. 
 
ల్యాబ్ లను బలోపేతం చేయాలని, ముఖ్యంగా పిహెచ్ సి ల స్థాయిలో వైద్య సేవల్ని బలోపేతం చేస్తే తప్ప ప్రజలకు చేరువ కాలేమని, ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆమె సూచించారు. జిల్లా ఆస్పత్రుల్లో త్వరలోనే క్యాన్సర్ నివారణ కోసం ప్రత్యేక చికిత్స ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు. క్యాన్సర్ నివారణ విషయంలో తెలంగాణలో అమలవుతున్న విధానాన్ని పరిశీలించాలని, ఎంఎన్ జే క్యాన్సర్ ఆస్పత్రితో సమన్వయం చేసుకొని ఏపీలో కూడా 13 జిల్లాల్లో క్యాన్సర్ నివారణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె తెలిపారు. 
 
వర్క్‌షాప్‌లో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, ఆయా విభాగాల హెచ్‌వోడీలు, పలు జిల్లాల నుంచి వచ్చిన అధికారులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వైద్య నిపుణులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు