జిల్లా కలెక్టరు వారి క్యాంపు కార్యాలయము, విజయవాడ నందు భవానీ దీక్షలు సందర్భముగా అన్ని శాఖల అధికారులతో కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశము జరిగినది.
ఈ సమావేశమునకు విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు, జిల్లా కలెక్టరు ఇంతియాజ్, జాయింట్ కలెక్టరు డా.కే.మాధవి లత, నగర మునిసిపల్ అడిషనల్ కమీషనరు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు, రెవిన్యూ అధికారులు, పొలిసు డిపార్ట్మెంటు వారు, ఇర్రిగేషన్ అధికారులు, మునిసిపల్ అధికారులు మరియు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు.
ఈ సమావేశము నందు కలెక్టరు సంబందిత డిపార్టుమెంటుల అధికారులుతో భవానీ దీక్ష విరమణ మరియు కలశజ్యోతి ఉత్సవములు సందర్బముగా చేయవలసిన ఏర్పాట్ల గురించి చర్చించారు.
అనంతరము కలెక్టరు మాట్లాడుతూ.. ఈ నెల 11 వ తేది సాయంత్రం 05 గం.లకు కలశజ్యోతులు శివరామ క్షేత్రము నుండి బయలుదేరి గాంధీనగర్ రోడ్, అలంకార్ సెంటర్, లెనిన్ సెంటర్, ఏలూరు రోడ్, చల్లపల్లి బంగ్లా, పొలిసు కంట్రోల్ రూము, ఫ్లైఓవర్, వినాయక స్వామీ దేవస్థానము, రధం సెంటర్ మీదుగా కనకదుర్గా నగర్ చేరునని, అందుకోసం భద్రత, రవాణా మరియు ఇతర అంశాల పరముగా అన్ని శాఖల సమన్వయముతో పటిష్టమైన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.
18-12-2019 నుండి 22-12-2019 వరకు జరుగు భవానీ దీక్షా విరమణల సందర్భముగా సుమారు 7 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేసినట్లు తెలిపారు. మొదటి రోజు అనగా 18-12-2019న ఉదయం 06.30 నిం.లకు అమ్మవారి దర్శనము ప్రారంభమయి, 06.45 నిమ్.లకు హోమగుండములు వెలిగించేదరని, ఉదయం 08 గం.లకు చండీహోమము జరగనున్నట్లు తెలిపారు. 22-12-2019 న పూర్ణాహుతి కార్యక్రమము జరుగునని తెలిపారు.
భవానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా, అమ్మవారి దర్శనం బాగా జరిగేలాణ మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భవానీ దీక్ష విరమణల సందర్భముగా భక్తులు పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణ చేయుచున్నందున, గిరి ప్రదక్షిణ చేయు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించుటకు గాను గిరి ప్రదక్షణ ప్రాంతములను మరియు ఇతర ప్రాంతములను త్వరలో సంభందిత శాఖల అధికారులతో కలసి పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు మాట్లాడుతూ.. భవానీ దీక్ష విరమణల సందర్భముగా భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనము నిలుపుదల చేసి, ముఖమండప దర్శనము ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మొదటి రెండు రోజులలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రూ. 300 ల టికెట్ తో అంతరాలయ దర్శనము కల్పించబడునని తెలిపారు. భవానీ దీక్షవిరమణ కాలం అనంతరము 2 రోజుల దాకా భక్తుల రద్దీ కొనసాగే అవకాశము ఉన్నదని తెలిపారు. క్యూలైన్లు వినాయక గుడి నుండి ప్రారంభమయి ఘాట్ రోడ్ మీదుగా దేవస్థానము వరకు ఏర్పాటు చేయడమైనదని తెలిపారు.
క్యూలైన్ల యందు భక్తులకు అవసరమైన త్రాగునీటి మరియు ఇతర ఏర్పాట్లు కల్పించి అమ్మవారి దర్శనము బాగా జరుగుటకు అన్ని శాఖల సమన్వయముతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమము నందు దేవస్థానము నుండిఆలయ కార్యనిర్వాహణాధికారితో పాటు ఆలయ కార్యనిర్వాహక ఇంజినీరు డి.వి.భాస్కర్, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు వార్లు, సహాయ కార్యనిర్వహణాధికారి వార్లు, పర్యవేక్షకులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.