ఈ నెల 21వ తేదీన చంద్రబాబును అరెస్టు చేస్తారా? నిజమా.. ఎందుకు..ఎలా..?
సోమవారం, 8 అక్టోబరు 2018 (22:02 IST)
బాబ్లీ కేసులో ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చేలా వుంది. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మహారాష్ట్రకు వెళ్లి ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై అక్కడి పోలీసులు పెట్టిన కేసులు ధర్మాబాద్ కోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే… ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు కోర్టు వాయిదాలకు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. చంద్రబాబు నాయుడుని సెప్టెంబర్ 21లోపు కోర్టు ముందు హాజరు పరచాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.
ధర్మాబాద్ కోర్టు నోటీసుల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారంగా మారింది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కోర్టు నోటీసులు ఇప్పించారంటూ టిడిపి నేతలు విమర్శలు చేశారు. ఈ గగ్గోలు సంగతి పక్కనపెడితే… కోర్టుకు వెళ్లాలా లేక న్యాయవాదిని పంపించి రీకాల్ పిటిషన్ వేయించాలా అనేదానిపై చర్చోపచర్చలు చేసిన టిడిపి నేతలు… ఆఖరికి న్యాయవాదిని పంపించాలని నిర్ణయించారు. అదేవిధంగా చేశారు. అయితే… దీనిపై న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు. నిందితునిగా ఉన్న చంద్రబాబు స్వయంగా కోర్టు ముందు హాజరు కావాల్సిందేని చెబుతూ…అక్టోబర్ 15 దాకా గడువు ఇచ్చారు.
ఈసారి చంద్రబాబు తప్పక కోర్టుకు వెళతారని, న్యాయస్థానాలంటే తమకు గౌరవం ఉందని మొదట్లో టిడిపి నేతలు చెప్పారు. గడువు దగ్గరపడే కొద్దీ ఏమయిందోగానీ…. ఈసారి వాయిదాకు కూడా హాజరు కాకూడదని, లాయర్‌ను పంపించాలని బాబు నిర్ణయించుకున్నారట. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చిన్న కేసులో నేరుగా హాజరు కావాల్సిన అవసరం లేదని పలువురు టిడిపి నేతల సూచనల మేరకే సిఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కోర్టుకు రావాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి భావించి వుంటే… గత వాయిదాలోనే రీకాల్ చేసి, వారెంట్‌ను ఉపసంహరించి వుండేవారు. స్వయంగా బాబు హాజరుకావాలని చెప్పిన న్యాయమూర్తికి…. చంద్రబాబు ముఖ్యమంత్రి అనే విషయం తెలియదా? ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం…. ఒక విధంగా న్యాయస్థానాన్ని ధిక్కరించే విధంగా ఉందని న్యాయవాదులు చెబుతున్నారు.
ఎంతపెద్ద వ్యక్తి అయినా కోర్టు ముందు సమానమే. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కోర్టు ముందు హాజరు కావాల్సిన అవసరం ఏముందని భావిస్తున్న టిడిపి నేతలు అదే మాటను న్యాయమూర్తికి చెప్పలరా… అనేది ప్రశ్న. న్యాయమూర్తి పట్టుదలకు పోతే చంద్రబాబు కోర్టు ముందు హాజరుకాక తప్పదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలావుండగా… ధర్మాబాద్ కోర్టు వారెంటును ఇంకా రాజకీయంగా వాడుకోవాలన్న ఆలోచన కూడా టిడిపికి ఉన్నదా అనే వాదనలు కూడా వస్తున్నాయి. ఒకవేళ అరెస్టు దాకా వెళితే… అప్పుడు ప్రజల సానుభూతి లభిస్తుందన్న ఆలోచన ఉండొచ్చు. ఈ సానుభూతి సంగతేమోగానీ…. చంద్రబాబు నాయుడికి న్యాయస్థానాలంటే గౌరవం లేదనే అభిప్రాయం ప్రబలంగా జనంలోకి వెళుతుంది.
దీనికంటే కోర్టుకు హాజరవడమే ముఖ్యమంత్రి స్థాయికి హుందాగా ఉంటుందనేది మరో వాదన. రాజకీయంగానూ ఉపగయోపడాలనుకుంటే…. రైతులతో ర్యాలీగా వెళ్లి కోర్టులో హాజరు కావాలని కొందరు చేసిన సూచనను అమలు చేసినా మంచిదే. చివరిగా చెప్పేదేమంటే…. కోర్టు గొప్పా… ముఖ్యమంత్రి గొప్పా అంటే…. న్యాయస్థానానికి ఎవరూ గొప్పకాదు. అందరూ సమానమే. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.