బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి: నివాళులర్పించిన సీఎం జగన్

సోమవారం, 5 ఏప్రియల్ 2021 (15:45 IST)
స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి, ముఖ్యమంత్రి నివాసంలో నివాళులర్పించారు సీఎం శ్రీ వైయస్‌.జగన్‌. 
 
హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘరామ్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
 
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. బాబు జగ్జీవన్ రామ్: ఏఓ స్వామినాయుడు
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన డా.బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని ఆర్డీవో కార్యాలయపు పరిపాలనాధికారి స్వామినాయుడు అన్నారు.
సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో  భారతదేశ మాజీ ఉప ప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ 114 వ జయంతి పురష్కరించుకొని ఆయన  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ సమగ్రతకు తన జీవితాన్ని ధారపోసిన నిష్కళంక దేశభక్తుడు డా.బాబు జగ్జీవన్ రామ్  అన్నారు. స్వాతంత్ర సమర యోధునిగా,  పరిపాలన దక్షునిగా ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించిన మహోన్నత వ్యక్తి డా.బాబు జగ్జీవన్ రామ్ అన్నారు. భారత ప్రభుత్వంలో అనేక  పదవులు చేపట్టి తద్వారా దేశ ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు

దివంగత బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్  గవర్నర్ సందేశం
"బాబు జగ్జీవన్ రామ్ జన్మదినం సందర్భంగా నా వినయ పూర్వకమైన నివాళులు అర్పిస్తున్నాను. బాబు జగ్జీవన్ రామ్ ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధునిగా, దూరదృష్టి గల నాయకునిగా దేశ సేవలో తరించారు.  రాజకీయ మేధావిగా దేశ అభివృద్ధికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సహకారం ఎల్లప్పుడూ గుర్తుంచుకోబడుతుంది.

సమర్థుడైన నిర్వాహకుని గానేకాక దేశానికి నిజాయితీతో కూడిన సేవలను అందించాడు. బాబు జగ్జీవన్ రామ్ నిజమైన ప్రజాస్వామ్యవాది. సమాజంలోని పేద, అణగారిన, బలహీన వర్గాలను ఉద్ధరించడానికి పోరాడారు. బాబుజీ 35 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా దేశానికి సేవలందించి, అనేక కీలక సంస్కరణల అమలులో తనదైన ముద్రను చూపారు. దేశంలో హరిత విప్లవం అమలు చేయటంలో  క్రియా శీలకంగా వ్యవహరించారు.” ఈ మేరకు గవర్నర్ సచివాలయం, రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. ”

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు