గన్‌మెన్లను సరెండర్ చేసిన మాజీ మంత్రి బాలినేని.. వైకాపా నేతలపై చర్యలకు పట్టు

మంగళవారం, 17 అక్టోబరు 2023 (14:32 IST)
ప్రకాశం జిల్లాలో నకిలీ దస్తావేజుల స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో అధికార పార్టీకి చెందిన నేతలు అనేకమంది ఉన్నారు. అలాంటి వారితో పాటు ఈ కేసులో సంబంధం ఉన్న తన అనుచరులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలంటూ జిల్లా పోలీసులు ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కానీ, పోలీసులు మాత్రం మెతక వైఖరిని అవలంభిస్తున్నారు. ఆయన మాటలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పోలీసుల చర్యకు నిరసనగా తన గన్‌మెన్లను ఆయన సరెండర్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఆయన ఓ లేఖ రాశారు. 
 
ఈ కేసులో ఉన్న ఎంతటి వారినైనా అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ కేసులో ఉన్నది అధికార పార్టీ నేతలనైనా వదిలిపెట్టవద్దన్నారు. అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. నాలుగేళ్ల నుంచే ఇలాంటి విచిత్ర పరిస్థితులు చూస్తున్నానంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. పోలీసులు తన సూచనను పెడచెవిన పెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. 
 
కాగా, ఒంగోలు జిల్లాలో తీవ్ర కలకలం రేపిన నకిలీ భూపత్రాల కేసులో ఇప్పటివరకు 10 మంది అరెస్టు అయ్యారు. వీరిలో అధికార పార్టీ నేతలు అధికంగా ఉన్నారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టవద్దని మూడు రోజుల క్రితం కలెక్టర్ సమక్షంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎస్పీని కోరారు. ఈ కేసులో తన పక్కనున్న వారినైనా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దన్నారు. పోలీసులు అనధికారికంగా కొన్ని పేర్లు చెబుతున్నారని బాలినేని పేర్కొన్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు