వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో వైకాపాకు చెందిన నేతలు మెల్లగా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. గత ఐదేళ్లపాటు తమ కన్నుసన్నలతో జిల్లా మొత్తాన్ని శాసించిన పెద్దిరెడ్డి... ఇపుడు చేజారిపోతున్న నేతలను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా చిత్తూరు జిల్లా కార్పొరేషన్‌లో వైకాపాకు భారీ షాక్ తగిలింది. నగర మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేశ్ రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు వైకాపాను వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో వీరంతా టీడీపీ కండువా కప్పుకునేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో వైకాపా కార్పొరేటర్లు టీడీపీలోకి చేరడంతో వైకాపా పాలకవర్గం పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది. దీన్ని వైకాపా నేతలు ముఖ్యంగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు, రాజంపేట వైకాపా ఎంపీ మిథున్ రెడ్డిలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ నేతలు చేజారిపోకుండా చర్యలు చేపట్టారు. అయితే, అనేక ప్రాంతాల్లో వైకాపా నేతలు మాత్రం పార్టీ మారేందుకే సిద్ధమయ్యారు.