విశాఖ రాజధానితో సీమ వాసులకు ఇబ్బందులు... ఉద్యమాలు తప్పవు : టీజీ వెంకటేష్

శనివారం, 28 డిశెంబరు 2019 (16:05 IST)
విశాఖను ఏపీ రాజధానిగా చేయడం వల్ల రాయలసీమ ప్రాంత వాసులకు ఒరిగేది ఏమీ లేదని, తీవ్రమైన ఇబ్బందులు తప్పవని టీడీపీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యమాలు తప్పవని ఆయన హెచ్చరించారు. 
 
నవ్యాంధ్ర రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన విషయం తెల్సిందే. దీంతో రాజధాని ప్రాంతంలో రాజధాని చిచ్చు చెలరేగింది. ఇది చల్లారకముందే రాయలసీమ ప్రాంతానికి చెందిన కొందరు నేతలు ఇపుడు సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. గ్రేటర్ రాయలసీమ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలన్నది వారి ప్రతిపాదనగా ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు ఓ లేఖ రాశారు. 
 
పరిపాలన వికేంద్రీకరణను సమర్ధిస్తున్నామని చెబుతూనే, శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం హైకోర్టు ఏర్పాటు హర్షణీయమని సీమ నేతలు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై సీమ ప్రాంతానికి చెందిన సీనియర్ నేతలైన గంగుల ప్రతాప్‌రెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, శైలజానాథ్‌, చెంగారెడ్డి, మాజీ డీజీపీలు ఆంజనేయరెడ్డి, దినేష్‌రెడ్డి సంతకాలు చేశారు. 
 
కాగా, బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ మాత్రం మరో ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. విశాఖలోనే రాజధాని ఉంటే రాయలసీమ వాసులకు ఇబ్బందులు తప్పవని, ఉద్యమాలు మొదలయ్యే అవకాశం ఉందని టీజీ చెప్పారు. హైకోర్టు రావడం వల్ల సీమ ప్రాంతానికి ఎలాంటి లాభం ఉండదన్నారు. పైగా, కర్నూలు, అమరావతి ప్రాంతాల్లో మినీ సచివాలయాలను నిర్మించాలని కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు