జగన్ ... ఆ ఒక్కటీ అడగొద్దు... అది ముగిసిన అధ్యాయం : బీజేపీ స్టేట్ చీఫ్

శుక్రవారం, 7 జూన్ 2019 (15:34 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఓ సలహా ఇచ్చారు. విభజన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేకహోదా డిమాండ్ మాత్రం మరిచిపోవాలని కోరారు. ఈ ఒక్కటి మినహా ఏది అడిగినా ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తారని చెప్పారు. అందువల్ల ప్రత్యేక హోదా మినహా ఇతర డిమాండ్లను సాధించుకోవాలని ఆయన సూచించారు.
 
ఇదే అంశంపై కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, పీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా విషయంలో ప్రధానమంత్రి మోడీని కలిసినా ఎలాంటి లాభం ఉండదన్నారు. 'ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా' అంశం ముగిసిన అధ్యాయమని.. అయినా.. సీఎం జగన్ మోడీని అడిగితే అభ్యంతరం లేదన్నారు. 
 
హోదా విషయం తప్ప.. జగన్ ఇంకేమడిగినా మోడీ చేస్తారని తేల్చిచెప్పారు. చంద్రబాబైనా, జగనైనా ప్రజలను మోసం చేయడం మానుకోవాలన్నారు. రాష్ట్రానికి నిధుల విషయంలోనైనా, అభివృద్ధి విషయంలోనైనా సహాయమందించడానికి మోడీ ముందుంటారని కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. 
 
కాగా, ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటుకూడా రాకపోవడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ స్పందిస్తూ, ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాటకు బీజేపీకి కట్టుబడలేదని, కాంగ్రెస్ పార్టీ తరహాలోనే మోసం చేసిందని నవ్యాంధ్ర ప్రజలు భావించారని, అందుకే బీజేపీకి ఓట్లు వేయలేదన్నారు. కానీ, రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ మాత్రం మరోలా స్పందించడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు