ఒకవైపు కృష్ణా నదికి వరద ఉధృతి తీవ్రంగా వస్తోంది. ప్రకాశం బ్యారేజీ అన్ని గేట్లను ఎత్తివేశారు. మరోవైపు వరద తీవ్రంగా వుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం వుందంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలావుంటే మరోసారి బుడమేరు వరద వస్తుందేమోనంటూ విజయవాడ నగరంలో వరద వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. డాబాకొట్లు సెంటర్ వద్ద దిగిన బోట్లు బుడమేరు కాలవలోని ఇందిరా నాయక్ నగర్ నుంచి పాల ఫ్యాక్టరీ వంతెన వరకు నిలిచిపోయిన గుర్రపు డెక్క తొలగించేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. దీనికి వరద ముంపుతో ఎలాంటి సంబంధం లేదని వివరించారు.
ఈ విషయంపై అధికారులు, సంబంధిత విభాగాలతో సమన్వయం కొనసాగుతున్నదని తెలిపారు. నగరంలో ఎటువంటి వరద ముప్పు లేదని పునరుద్ఘాటిస్తూ, జరుగుతున్న వదంతులను ఎవరు నమ్మవద్దని ప్రజలను కోరారు.