ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోర్టు న్యాయమూర్తులపై అసభ్యకర పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నాయి. ముఖ్యంగా, న్యాయవ్యవస్థను అస్సలు పట్టించుకోవట్లేదని, జడ్జిల ఫిర్యాదునూ లెక్క చేయట్లేదని సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలను ఉద్దేశించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు చేశారు. జడ్జిలను బెదిరిస్తున్నా, వారిపై పోస్టులు పెడుతున్నా పట్టించుకోవట్లేదని అసహనం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
ఈ నేపథ్యంలో ఏపీలో హైకోర్టు న్యాయమూర్తులపై పోస్టులు పెట్టిన ఐదుగురిని సీబీఐ అరెస్టు చేసింది. జడ్జిల పరువుకు భంగం కలిగించారని పేర్కొంటూ వారిపై కేసు నమోదు చేసింది. జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్ జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్యకు సంబంధించి మూడు రోజుల క్రితం సీజేఐ రమణ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
సీబీఐలో ఏమాత్రం మార్పు రాలేదని జస్టిస్ రమణ కాస్తంత కఠువుగానే వ్యాఖ్యానించారు. ఏదో కొంతైన మారుతుందన్న నమ్మకం ఉన్నా అది జరగలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇవే పరిస్థితులున్నాయని చెప్పేందుకు బాధపడుతున్నానన్నారు. బెదిరింపులు వస్తున్నాయని జడ్జిలు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. చీఫ్ జస్టీస్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన దర్యాప్తు సంస్థలు న్యాయవ్యవస్థను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నాయి.