షరీఫ్‌పై ప్రశంసలు-విమర్శలు.. అచ్చెన్న పాదాభివందనం.. రాజీనామా చేస్తారా?

గురువారం, 23 జనవరి 2020 (14:28 IST)
ఏపీ శాసనమండలిలో జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రవేశపెట్టిన రెండు బిల్లులను మండలి ఛైర్మన్ షరీఫ్ సెలక్ట్ కమిటీకి పంపించి సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. వికేంద్రీక‌ర‌ణ బిల్లు, సీఆర్డీఏ ర‌ద్దు బిల్లుల‌ను అరుపులు, గంద‌ర‌గోళం మ‌ధ్య‌నే మండ‌లి చైర్మ‌న్ సెల‌క్ట్ క‌మిటీకి పంపించి ఆ వెంట‌నే త‌న ఛాంబ‌ర్ లోకి వెళ్లిపోయారు. దీంతో మంత్రి బుగ్గ‌న ఈ రోజు చీక‌టి దిన‌మ‌ని అన్నారు.
 
కానీ మండలి ఛైర్మన్ షరీఫ్ త‌న‌ స్వస్థలం నరసాపురానికి వెళ్ల‌డంతో ఆయనకు ఘన స్వాగతం లభించింది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల‌ను మండలి చైర్మన్‌ షరీఫ్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపడంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంద‌ర్భంగా విజయవాడలో మండ‌లి చైర్మ‌న్ ష‌రీఫ్‌కు చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది. అలాగే అనంతపురం జిల్లా మడకశిరలోనూ మండ‌లి చైర్మన్ షరీఫ్ చిత్రపటానికి, అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం జరిగింది. 
 
మరోవైపు.. ఏపీ శాసన మండలి ఛైర్మన్ షరీఫ్‌ను మంత్రులు అవమానించారనే విషయం తెలుసుకుని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆయన నివాసానికి వెళ్ళి పరామర్శించారు. ఛైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని అచ్చెన్న కొనియాడారు. రాష్ట్రం యావత్తూ ఆయనను ప్రశంసిస్తోందని షరీఫ్‌తో చెప్పారు. చాలా ఒత్తిడిని తట్టుకొని మీరు నిర్ణయం తీసుకొన్నారు. లక్షలాది మంది గుండెల్లో మీరు ఉంటారు అంటూ ఆయనకు అచ్చెన్న పాదాభివందనం చేశారు.
 
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ చట్టం రద్దు, 3 రాజధానుల బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందాయి. శాసన మండలిలో మాత్రం ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్ తీరును నిరసిస్తూ వైసీపీ సభ్యులు, మంత్రులు ఆయనపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
 
ఒక దశలో పోడియం పైకి ఎక్కి చైర్మన్‌ను వ్యక్తిగతంగా కులంపేరుతో దూషించారని తెలుస్తోంది. బుధవారం సభలో జరిగిన పరిణామాల పట్ల, తనను వ్యక్తిగతంగా దూషించడం పట్ల షరీఫ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని తెలిసింది. తన పదవికి రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు