విశాఖ జిల్లాలోని నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ ఎనస్థీయన్ డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ ద్వారా తమ నిరసన తెలిపారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి పై ముందుండి పోరాడుతున్న డాక్టర్లకు, వైద్య సిబ్బంది కి మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం మీది. మాస్కులు ఇవ్వండి మహాప్రభో అని అడిగిన డాక్టర్ ని సస్పెండ్ చెయ్యడం జగన్ గారి అధికార మదానికి నిదర్శనం.
డాక్టర్ల దగ్గర ఉండాల్సిన మాస్కులు,వ్యక్తిగత రక్షణ కిట్లు కొట్టేసి మీడియాకి ఫోజులు ఇస్తున్న వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేను ఎం చెయ్యాలి జగన్ గారు. అసలు కరోనా పెద్ద విషయం కాదు ఎన్నికలే ముఖ్యం అని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన మీకు ఎం శిక్ష వెయ్యాలి?" అని విమర్శలు గుప్పించారు.
డాక్టర్లను ఇలా అగౌర పరిస్తే ఎలా?: చంద్రబాబు
ఎన్-95 మాస్కుల లేవన్న విషయాన్ని దృష్టికి తీసుకు వస్తే.. సమస్యను పట్టించుకోకుండా డాక్టర్‌ను సస్పెండ్ చేస్తారా అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు.
ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. జగన్ సర్కార్ తీసుకున్న ఈ చర్య తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ముందుండి పోరాడుతున్న డాక్టర్లను ఇలా అగౌర పరిస్తే ఎలా అని ట్వీట్ చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో డాక్టర్లను, వైద్య సిబ్బందిని జాగ్రత్తగా కాపాడుకోవల్సిన అవసరం ఉందన్నారు.