యనమల రామకృష్ణుడు ఓ ధ్వజస్తంభం : చంద్రబాబు

శనివారం, 25 జనవరి 2020 (15:19 IST)
పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. ఇటీవల మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లుల సమయంలో శాసన మండలిలో యనమల నడుచుకున్న తీరు అద్భుతమని చెప్పుకొచ్చారు. 
 
ఇదే అంశంపై చంద్రబాబు మరోమారు స్పందిస్తూ, శాసనమండలిలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను నిలువరించేందుకు యనమల విశేషంగా కృషి చేశారని కొనియాడారు. కౌన్సిల్‌లో ధ్వజస్తంభంలా నిలిచారని అభినందించారు. మండలిలో టీడీపీ నేతలు చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా ప్రశంసించారు. 1984లో టీడీపీ ధర్మ పోరాటాన్ని ప్రపంచం మొత్తం అభినందించిందని.. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీలకు ఆ అవకాశం వచ్చిందన్నారు. విశ్వసనీయత, విలువలతో నిలబడ్డారని చెప్పుకొచ్చారు.
 
ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తులు బెదిరింపులు, ప్రలోభాలకు లొంగితే తెరమరుగవుతారని.. త్యాగాలు చేసిన వాళ్లు మాత్రమే ప్రజల గుండెల్లో ఉంటారన్నారు. సీఎం జగన్ చేతిలో మళ్లీ మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. వైసీపీ సర్కార్‌కు చురకలంటించారు. ప్రజలు ఒక్కసారే మోసపోతారని.. పదేపదే అది జరగదన్నారు. జనం గుండెల నుంచి టీడీపీని తుడిపేయడం అసాధ్యమని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు