రామ్మోహన్, అఖిలప్రియలపై బాబు ప్రశంసలు.. రైతుల వద్దకు టెక్నాలజీ..

సోమవారం, 29 మే 2017 (17:32 IST)
మహానాడు వేదికపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు, మంత్రి భూమా అఖిలప్రియలపై ప్రశంసలు కురిపించారు. యువనేతలు అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. టిడిపి యువతకు పెద్దపీట వేస్తుందని చంద్రబాబు అన్నారు. యువకుడైన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు ప్రజల నేతగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. ఎర్రన్నాయుడు ఆకస్మిక మరణం పార్టీకి తీరనిలోటుగా మారిందని చంద్రబాబు తెలిపారు. 
 
ఎర్రన్నాయుడు తనకు ఆత్మీయుడని చంద్రబాబు తెలిపారు. ఆయన కుటుంబం సేవలను ఎప్పటికీ మరిచిపోలేమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన గురించి మాట్లాడుతున్న సమయంలో రామ్మోహన్ నాయుడు నవ్వుతూ కనిపించారు. తండ్రిలేని లోటు తనకు ఉండదని.. గార్డియన్‌గా తాను వుంటానని రామ్మోహన్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని చంద్రబాబు తెలిపారు. నాలుగున్నరేళ్ల పాటు కష్టపడి రాజకీయ నేతగా, ఎంపీగా రామ్మోహన్ ఎదిగాడని కొనియాడారు. తండ్రి చనిపోవడంతో భూమా అఖిల ప్రియకు మంత్రి పదవి ఇచ్చామని, ఆమె కూడా సమర్థవంతంగా పని చేస్తూ తన నమ్మకాన్ని నిలబెడుతోందన్నారు.
 
అమరావతి, పోలవరం తనకు రెండు కళ్లని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధానిపై ఎన్ని అడ్డంకులు సృష్టించినా పనులు ఆగవన్నారు. పోలవరంతో రాష్ట్రంలో కరవును పారద్రోలుతామన్నారు. టెక్నాలజీని రైతుల వద్దకు చేరుస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రాజకీయాల్లోకి యువత రావాలని పిలుపునిచ్చారు. యువ శక్తి తెలుగుదేశం పార్టీకి అవసరమని తెలిపారు. రాజకీయ నేతలు వారి వారసులే రాజకీయాల్లోకి రావాలని లేదు. అన్నీ రంగాలకు చెందిన యువతను రాజకీయాల్లో రావాలని చంద్రబాబు మహానాడు వేదికగా పిలుపు నిచ్చారు.

వెబ్దునియా పై చదవండి