తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం కుప్పం వెళుతున్నారు. అక్కడ ఆయన మూడు రోజుల పాటు మకాం వేస్తారు. ఈ సమయంలో పార్టీ నేతలు, బూత్ ఇన్‌చార్జిల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తారు. ఓటర్ల జాబితాపై పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తారు. అలాగే, కుప్పంలో కొత్తగా నిర్మించిన కొత్త పార్టీ కార్యాలయాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారు.
ప్రధానంగా అధికార పార్టీ నేతలు తమ అధికారాన్ని ఉపయోగించి ఒకే ఓటరుకు మూడు చోట్ల ఓటు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అందువల్ల పార్టీ నేతలు, కార్యకర్తలు మరింత అప్రమత్తంగా ఉండేలా వారికి పలు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.
అంతేకాకుండా కుప్పం పరిధిలో మొత్తం 11 క్లస్టర్లు ఉండగా, ప్రతి క్లస్టర్‌కు 45 నిమిషాల సమయాన్ని చంద్రబాబు కేటాయించి, పార్టీ నేతలు సమాలోచనలు చేస్తారు. గురువారం మధ్యాహ్నం ఆయన అన్ని క్లస్టర్లలోని 50 మంది ప్రధాన నేతలతో సమావేశాన్ని నిర్వహించనున్నారు.