సీఎం జగన్ మరోవరం : ఇంటర్ విద్యార్థులకూ అమ్మఒడి పథకం

గురువారం, 27 జూన్ 2019 (15:10 IST)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ విద్యార్థులకు కూడా అమ్మఒడి పథకాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఈ పథకం కింద తెల్ల రేషన్ కార్డు కలిగిన విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చేరితే వారికి యేటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. 
 
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్. జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వివిధ మంత్రిత్వ శాఖలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఆయన గురువారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో రాష్ట్ర విద్యామంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు పాఠశాల, ఉన్నత విద్యాశాఖకు చెందిన ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, తమ పిల్లలను పాఠశాలలకు పంపే ప్రతి తల్లికి అమ్మఒడి పథకం కింద యేటా రూ.15 వేలు ఇస్తామన్నారు. ఈ పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని ఆయన సూచించారు. 
 
అంతేకాకుండా, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీతల్లికి ఏటా రూ.15 వేలు ఇస్తామని పునరుద్ఘాటించారు. ఇక విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకం కోసం వెంటనే సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
 
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో ఉన్న అన్ని ఖాళీలను యేడాది చివరికల్లా భర్తీ చేయాలని చెప్పారు. పారదర్శక విధానంలో, అత్యంత అనుభవం ఉన్నవారినే వీసీలుగా ఎంపిక చేయాలని, ఇందుకోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేయాలని జగన్ ఉన్నతాధికారులకు సూచన చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు