గొల్లపూడికి అవార్డుల పంట.. మృతిపట్ల కేసీఆర్ - జగన్ దిగ్భ్రాంతి

గురువారం, 12 డిశెంబరు 2019 (14:54 IST)
సాధారణంగా ఒక రంగంలో రాణించడమే కష్టమైన ఈ రోజుల్లో ఎన్నో రంగాల్లో పరిపూర్ణత సాధించిన బహు కళాప్రపూర్ణుడు గొల్లపూడి మారుతీరావు. ఈయన విలక్షణ నటుడు, ప్రతి నాయకుడు, రచయిత, కవి, జర్నలిస్టు, ప్రసంగీకుడుగా పేరుగడించి బముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. 
 
ఇలా పలు రంగాల్లో రాణించిన గొల్లపూడి మారుతీరావుకు నాలుగు సార్లు నంది పురస్కారాలు వరించాయి. 1963లో డాక్టర్‌ చక్రవర్తి సినిమాకు ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిగా, 1965లో ఆత్మగౌరవం అనే సినిమాకి ఉత్తమ రచయితగా, 1989లో కళ్ళు అనే రచన సినిమాగా వచ్చింది. దీనికి ఉత్తమ రచయితగా, 1991లో మాస్టారి కాపురం సినిమాకు గానూ ఉత్తమ సంభాషణల రచయితగా నంది అవార్డులు అందుకున్నారు. 
 
అలాగే, అప్పాజోశ్యుల విష్ణుభట్ల ఫౌండేషన్‌ జీవన సాఫల్య అవార్డు, గురజాడ అప్పారావు, పురస్కారం, పులికంటి కృష్ణా రెడ్డి పురస్కారం, ఆత్రేయ స్మారక పురస్కారం, రాజ్యలక్ష్మి అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు, వంశీ బర్కిలీ అవార్డు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అవార్డు, కొండముది శ్రీరామ చంద్రమూర్తి అవార్డు, లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ అవార్డు ఇలా ఎన్నో అవార్డులు పొందారు. 
 
ఇకపోతే, సంపాదకుడు గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు తెలుగు భాషాభివృద్ధికి దిశానిర్దేశనం చేశాయని ముఖ్యమంత్రి అన్నారు. మారుతీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
 
అలాగే, సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీ రావు మృతి పట్ల తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రచయిత, వ్యాఖ్యాతగా కూడా గొల్లపూడి మారుతీ రావు రాణించారని గుర్తు చేశారు. సుమారు 250కి పైగా చిత్రాలలో నటించిన ఆయన నాలుగు నంది అవార్డులు అందుకున్నారు. ఈయన మృతితో చిత్ర పరిశ్రమ ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని గుర్తుచేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు