వైఎస్సార్ పథకాలకు జగన్ పంగనామాలు పెట్టారు: సీపీఐ నారాయణ

మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (14:49 IST)
దివంగత ముఖ్యమంత్రి ప్రస్తుత సీఎం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొని వచ్చిన పథకాలకు జగన్ సర్కారు పంగనామాలు పెడుతుందని సీపీఐ సీనియర్ నేత నారాయణ విమర్శించారు. గతంలో ఉచిత విద్యుత్  కోసం వైఎస్సార్ పోరాటం చేసి దాన్ని అమలులోనికి తెచ్చారని, కాని జగన్ సర్కారు దాన్ని ఎత్తివేసేందుకు కోతలు పెడుతుందని తెలిపారు.
 
ఎన్నికల్లో మాట తప్పడు, మడమ తిప్పడు అన్న జగన్ ఇప్పుడు ఉచిత విద్యుత్ విషయంలో మాత్రం వెనక్కు తగ్గుతున్నారని సీపీఐ నారాయణ ఆక్షేపించారు. ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్లను పెట్టాలంటున్న జగన్ నిర్ణయం సరికాదన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం వెనక్కి తగ్గడమే అన్నారు.
 
గతంలో వైఎస్ ఉచిత విద్యుత్ కోసం పోరాటం చేసినప్పుడు అప్పట్లో సీపీఐ కూడా కాంగ్రెస్‌తో కలిసి ఇందుకోసం పోరాడింది. ఆ తరువాత వైఎస్ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్‌ను అమల్లోనికి తెచ్చారు. కానీ ప్రస్తుత వైసీపీ సర్కారు కేంద్ర ప్రభుత్వ విధానాలకు లొంగి ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకుంది.
 
నగదు బదిలీ చేస్తామని హామీలు ఇస్తున్నా రైతుల్లో మాత్రం అనుమానాలు తొలగలేదు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలపై వామపక్షాలు ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నారాయణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు