ఉత్తర కోస్తా జిల్లాలపై తితలీ తుఫాను దాడిచేయనుంది. తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం సోమవారం అర్థరాత్రి తీవ్ర వాయుగుండంగా మారి, మంగళవారం ఉదయానికి మరింత తీవ్రరూపం దాల్చింది. దీనికి తితలీ అనే నామకరణం చేసిన విషయం తెల్సిందే. ఈ తుఫాను ఇచ్ఛాపురం - గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే వీలుంది. ఆ సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి.
కాగా, గురువారం ఉదయం తితలీ తీరందాటే అవకాశం ఉంది. ఈ సమయంలో భారీ వర్షాలతోపాటు 100 కి.మీ.వేగంతో గాలులు ఈడ్చికొడతాయి. సముద్ర అలలు ఎగసిపడతాయి. ఈ తుఫాను ప్రభావంతో మంగళవారం విజయనగరం జిల్లా భోగాపురంలోని ముక్కాం వద్ద సముద్రం 100 అడుగుల ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ క్రమంలో ఒక బోటు తిరగబడి.. ఇద్దరు జాలర్లు గాయపడ్డారు.
ఈ తుఫాను ప్రస్తుతం గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 530కి.మీ. దూరంలో, కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 480కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరింత బలపడి బుధవారానికి తీవ్ర పెనుతుఫాన్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. గురువారం ఉదయం కళింగపట్నం, గోపాలపూర్ మధ్య తీరం దాటిన తర్వాత ఈశాన్యంగా దిశ మార్చుకుని ఒడిసా తీరంవెంబడి పశ్చిమ బెంగాల్‌వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.